ఫీజు బకాయిలకు మోక్షం

18 Aug, 2017 02:49 IST|Sakshi
  • రూ.418.11 కోట్లు విడుదల
  • సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఉపకార వేతనాలకు మోక్షం లభించింది. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండిం గ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తొలివిడతలో రూ.418.11 కోట్లు విడుదల చేయగా వీటిని ప్రాధాన్యతాక్రమంలో విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు. 2016–17 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 13.67 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతన పథకాలకు అర్హత సాధించారు. ఈ పథకాల కింద అర్హులకు దాదాపు రూ.2,050.55 కోట్లు చెల్లించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

    దరఖాస్తుల పరిశీలన 60 శాతం పూర్తి
    2016–17 విద్యా సంవత్సరంలో 13.67 లక్షల దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. ఏప్రిల్‌ రెండో వారంలో పరిశీలన ప్రక్రియ మొదలు పెట్టారు. వసతిగృహ సంక్షేమాధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు 10.20 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల కింద రూ.1,556 కోట్లు చెల్లించాల్సి ఉంది.

    వచ్చే నెలలో మరో రూ.400 కోట్లు!
    ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన బకాయిలకు సంబంధించి సెప్టెంబర్‌ రెండో వారంలో మరో రూ.400 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆలోపు దరఖాస్తుల పరిశీలన సైతం పూర్తికానుందని, బకాయిలపై స్పష్టత వచ్చిన తర్వాత మూడోవిడత పెద్దమొత్తంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు