సచ్చినా కష్టమే..

22 Aug, 2014 00:34 IST|Sakshi

ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా వ్యాప్తంగా నిర్మల్, భైంసా, మంచిర్యాల ఏరి యా ఆస్పత్రులతోపాటు ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్ (టి), బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ), ముథోల్, లక్సెట్టిపేట, చెన్నూర్, బోథ్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం జరుగుతాయి. పోస్టుమార్టం చేసేందుకు ఒక సివిల్ సర్జన్, ముగ్గురు ఎంఎన్‌వోలు అవసరం. వీరు షిఫ్ట్‌వైస్‌గా విధులు నిర్వర్తించాలి. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రుల్లో 26 మంది సివిల్ సర్జన్‌లు, 17 మంది ఎంఎన్‌వోలు ఉన్నారు.

సీహెచ్‌సీల్లో 24 మంది సివిల్ సర్జన్‌లు, 20 మంది ఎంఎన్‌వోలు, సివిల్ ఆస్పత్రుల్లో 11 మంది మెడికల్ ఆఫీసర్లు, 13 మంది ఎంఎన్‌వోలు పనిచేస్తున్నారు. ఈ ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్ కిందకి వస్తాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 72 పీహెచ్‌సీల్లో ఎక్కడా కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించకపోవడంతో ఈ ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఏరియా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం గదులు ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

 కానరాని సౌకర్యాలు
 జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలో మూడు ఫ్రీజర్‌లు ఉండగా ఒకటి మూలనపడింది. గది చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, చెత్తచెదారం ఉంది. పోస్టుమార్టం గదుల్లో మృతదేహాన్ని భద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్‌లు(మార్చురీ యూనిట్) కనిపించడం లేదు. పోస్టుమార్టం గదుల్లో నీటిసౌకర్యం, రెండు పెద్ద బెంచిలతోపాటు, ఒక విశాలమైన హాల్ ఉండాలి. మూడు మృతదేహాలను ఉంచే సామర్థ్యం గల ఫ్రీజర్‌లు అందుబాటులో ఉంచాలి. గదిని ఎప్పుడు శుభ్రం చేసేందుకు కెమికల్స్ ఉపయోగించాలి.
పోస్టుమార్టం చేసే సమయంలో ఉప్పు, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉండాలి. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు ముందస్తుగా సెంట్ చల్లాలి. అయితే ప్రస్తుతం పోస్టుమార్టం చేస్తున్న చాలా ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవు. మృతదేహాలను పడుకోబెట్టేందుకు గద్దెలు (బెంచీ), శవాలను భద్రపరిచే ఫ్రీజర్‌లు, ఇతర పరికరాలు కానరావడం లేదు. శవాలను భద్రపరిచే ఫ్రీజర్‌లు లేకపోవడంతో అనాథ శవాలు వచ్చినప్పుడు రోజుల తరబడి ఉంచడం ద్వారా కుళ్లిపోతున్నాయి. ఒక రిమ్స్ ఆస్పత్రిలో తప్ప ఎక్కడ కూడా ఫ్రీజర్‌లు లేవని తెలుస్తోంది. పోస్టుమార్టం గది అంటేనే భయపడేలా కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదితోపాటు, ఇతర ఆస్పత్రుల్లో  పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.

పోస్టుమార్టం చేసేందుకు ఉపయోగించే సుత్తె, కత్తెర, ఇతర చిన్న పరికరాలు కూడా పాతవే వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గదిలోపల పోస్టుమార్టం తర్వాత శుభ్రపర్చకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నిర్మల్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం గదిలోపల సౌకర్యాలు లేక ఆరుబయటే పోస్టుమార్టం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో ఇక్కడి సిబ్బంది పోస్టుమార్టం గదులకు తాళం వేసి వెళ్లిపోవడంతో వైద్యులు, సిబ్బంది కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా కేసుల్లో పోస్టుమార్టం ఒకరోజులో చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో బాధిత బంధువులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

 సౌకర్యాలు కల్పిస్తాం.. - బసవేశ్వరీ, డీఎంహెచ్‌వో
 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పోస్టుమార్టం గదుల్లో లేని సౌకర్యాలపై దృష్టిపెట్టాం. ఫ్రీజర్‌లు లేని ఆస్పత్రులను గుర్తించి వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటాం. మృతదేహం వచ్చిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో పోస్టుమార్టం నిర్వహించే వెసులుబాటు లేదు. అన్ని ఏరియా, సివిల్ ఆస్పత్రుల్లో మెడికల్ ఆఫీసర్‌లు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు