అందుబాటులోకి మరిన్ని పోస్టాఫీసులు

1 Apr, 2020 02:12 IST|Sakshi

పోస్టల్‌ సేవలతోపాటు ఆసరా పింఛన్ల చెల్లింపు

అత్యవసర వస్తువుల తరలింపునకు పోస్టల్‌ వ్యాన్లు సిద్ధం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసులు తెరుచుకుంటున్నాయి. మంగళవారం 633 డెలివరీ పోస్టాఫీసులు తెరుచుకోగా, బుధవారం నుంచి 4,967 బ్రాంచి తపాలా కార్యాలయాలు సేవలు ప్రారంభించబోతున్నాయి. డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్‌ లాంటి సేవింగ్స్‌ బ్యాంక్‌ ఆపరేషన్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు స్పీడ్‌పోస్టు, పార్శిల్‌ సర్వీసులు కూడా ప్రారంభమవుతాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేనందున స్పీడ్‌ పోస్టులాంటి సేవల్లో జాప్యం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని తపాలా శాఖ పేర్కొంది.

ఇప్పటికే లాక్‌డౌన్‌ సమయంలో 4,400 బ్యాగ్స్‌ పరిమాణంలో పోస్టల్‌ డెలివరీలు నిర్వహించగా, పదోతరగతి, ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 5,525 పరీక్ష పత్రాల పార్శిళ్లను తరలించినట్టు పేర్కొంది. 22 లక్షల మంది ఆసరా లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపునకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. 33 జిల్లాలకు 20 మెయిల్‌ మోటారు వాహనాల ద్వారా అత్యవసర మందులు, వైద్య పరికరాలను పంపిణీ చేస్తున్నట్టు పేర్కొంది. వలస కార్మికులు వంటి వారికి అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేసేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. కూరగాయలకు సంబంధించి మొబైల్‌ మార్కెట్లుగా వాటిని వాడేందుకు కూడా వ్యవసాయ శాఖతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా