కథ మారే

31 Aug, 2019 12:15 IST|Sakshi

కొత్త సేవల్లోకి తపాలాశాఖ

బ్యాంకింగ్, సరుకు రవాణా, ఈ–కామర్స్‌ రంగాల్లో బాధ్యతలు

పాస్‌పోర్టు, ఆధార్‌ తదితర సేవలు సైతం

పోస్టుకార్డులు, ఉత్తరాలు, మనీయార్డర్లకు కాలం చెల్లు

ఇప్పటికే కొన్ని పోస్ట్‌బాక్సుల ఎత్తివేత

ఆర్థిక అవసరాలరీత్యా పోస్టాఫీసుల్లో నయా జమానా

సాక్షి, సిటీబ్యూరో: కాలం గిర్రున తిరిగింది.. కార్డులకు కాలం చెల్లింది.. తపాలా శాఖ కథ మారింది.. కొత్త సేవల్లోకి షిఫ్టు అయింది. ఒకప్పుడు ఉత్తరాలు, పోస్టు్టకార్డులు,మనీయార్డర్లు మోసుకొచ్చిన తపాలా శాఖ... ఇప్పుడు సరుకు రవాణా, ఈ–కామర్స్‌డెలివరీలు, బ్యాంకింగ్, కొరియర్, బీమా, పెన్షన్, పాస్‌పోర్టు, ఆధార్, టీటీడీ టికెట్లు, పుస్తకాలు, మందుల బట్వాడా తదితర సేవల్లో బిజీ అయింది.ఆర్థిక అవసరాలరీత్యా ప్రస్తుతం వాణిజ్యపర సేవలతో లాభాలు ఆర్జించే పనిలో పడింది. 160 ఏళ్లు సేవలందించిన టెలిగ్రామ్‌ ఐదేళ్ల క్రితంకనుమరుగైంది. ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌ విప్లవంతో ఉత్తరాలు,పోస్టుకార్డులను ఈ–మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు మరిపించగా... మనీయార్డర్లను డిజిటల్‌ బ్యాంకింగ్‌ మింగేసింది. ఆధునిక సాంకేతిక విప్లవంతో తపాలాశాఖ మనుగడ ప్రశ్నార్థకమైంది.ఈ నేపథ్యంలో ఆధునికతను అందిపుచ్చుకున్న తపాలాశాఖ వినూత్న ఆలోచనలతో సరికొత్త సేవలకు ముందడుగు వేసింది.పోస్టల్‌ సిబ్బందిని సరుకు రవాణా, ఈ–కామర్స్‌ డెలివరీలకు వినియోగించుకుంటోంది. మరోవైపు బ్యాంకింగ్‌ బాధ్యతలు చేపట్టింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాస్ట్‌పోర్టు, ఆధార్‌ నమోదు తదితర సేవలందిస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు, ఇన్‌లాండ్‌ లేటర్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం బిజినెస్‌ మెయిల్స్, పార్శిల్స్, స్పీడ్, రిజిస్టర్డ్‌ మెయిల్స్‌ పెరిగాయి. అత్యధిక శాతం పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్‌ చెక్‌బుక్స్, స్టూడెంట్స్‌ స్టడీ మెటీరియల్‌ తదితరాల బట్వాడా జరుగుతోంది. తపాలాశాఖ సాంకేతిక విజ్ఞానంతో సాధారణ ఉత్తరాల బట్వాడాపై దృష్టిసారించింది. పోస్టుబాక్స్‌లు సకాలంలో క్లియరెన్స్‌ చేసేందుకు స్మార్ట్‌ఫోన్లతో స్కానింగ్‌ నిర్వహిస్తోంది. 

ఈ–కామర్స్‌లో 60శాతం  
ఈ–కామర్స్‌ వ్యాపారానికి ప్రధానమైంది డెలివరీ. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నెట్‌వర్క్‌పై తపాలాశాఖ దృష్టిసారించింది. సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. లాజిస్టిక్స్‌ కంపెనీలతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ–కామర్స్‌ పార్శిళ్ల ద్వారా లాభాలు ఆర్జిస్తోంది. మరోవైపు క్యాష్‌ అండ్‌ డెలివరీ ఆర్డర్ల (సీఓడీ) బట్వాడాకు నాప్తల్‌ వంటివి పూర్తిగా పోస్టల్‌ విభాగాలపై ఆధారపడ్డాయి. సీఓడీలో ఒకవైపు మాత్రమే చార్జీలు వసూలు చేస్తుండడంతో మంచి ఆధరణ లభిస్తోంది. స్టాంపుల విక్రయానికి స్నాప్‌డిల్, దేశవ్యాప్త డెలివరీ కోసం అమోజాన్‌లు ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తమ్మీద ఈ–కామర్స్‌ డెలివరీలలో 60శాతం వాటా పోస్టల్‌ శాఖదే.  

ఐపీపీబీ ప్రారంభం..  
వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోస్టల్‌ శాఖ ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబి)ని ప్రారంభించింది. ఈ బ్యాంక్‌ ద్వారా మూడు  రకాల జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతాలు అందిస్తోంది. వీటిలో అపరిమిత ఉపసంహరణలు, డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్, డిపాజిట్ల వెసులుబాటు కల్పించింది. పొదుపు ఖాతాలకు 4శాతం వడ్డీ రేటు వర్తిస్తోంది. ఈ ఖాతా ద్వారా డిపాజిట్, మనీ ట్రాన్స్‌ఫర్, డీబీటీ, బిల్లింగ్‌ పేమెంట్, ఇంటర్నెట్‌ బ్యాకింగ్, డిజిటల్‌ పేమెంట్‌ సేవలు పొందొచ్చు. 

ట్రాన్స్‌పోర్టు సైతం...  
తపాలాశాఖ పోస్టల్‌ టాన్స్‌పోర్టు బిజినెస్‌కు తెరలేపింది. మహానగరంలో ప్రత్యేక పోస్టల్‌ పార్శిల్‌ హబ్స్‌ ఏర్పాటు చేసింది. నగర శివార్లలోని ఆటోనగర్, ముషీరాబాద్‌ సమీపంలోని పద్మారావునగర్‌లలో పార్శిల్‌ హబ్స్‌ ఉన్నాయి. వస్తువుల బుకింగ్‌ మాత్రం సమీపంలోని పోస్టు ఆఫీస్‌లలో చేయవచ్చు. అదే విధంగా ప్యాకింగ్‌ సర్వీస్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. వస్తువు అప్పగిస్తే తపాలా శాఖ సిబ్బంది ప్యాకింగ్‌ చేసి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతున్నారు. ప్యాకింగ్‌కు ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేస్తారు. పోస్టల్‌ ట్రాన్స్‌పోర్టుల ద్వారా వస్తువులతో పాటు కూరగాయల రవాణాకు కూడా వెసలుబాటు కల్పించింది. వస్తువుల బరువును బట్టి కిలోమీటర్ల చొప్పున చార్జీలు వసూలు చేస్తోంది. లాజిస్టిక్‌ కంపెనీల నుంచి పార్శిళ్ల పిక్‌ఆప్‌ కూడా జోరందుకుంది. 

ఎగుమతులు... దిగుమతులు  
నగరం ఇప్పుడు ఎన్నో ఉత్పత్తులకు హబ్‌గా మారుతోంది. శివారు ప్రాంతాల్లో తయారీ రంగం విస్తరిస్తోంది. ఫార్మాతో పాటు చాలా వస్తువులు ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. వీటిల్లో తక్కువ పెట్టుబడితో చిన్నస్థాయి తయారీ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి  పెద్ద పెద్ద యూనిట్లు షిప్పింగ్‌ ద్వారా ఎగుమతి చేస్తుండగా.. చిన్నచిన్న తయారీ యూనిట్లు మాత్రం తపాలా ద్వారా పార్శిళ్ల రూపంలో పంపుతున్నాయి. ఇందుకోసం తపాలా శాఖ నగరంలోని హుమాయూన్‌నగర్‌లో సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగంతో కలసి ఫారిన్‌ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగం ప్రత్యేక స్కానర్ల ద్వారా విదేశాలకు ఎగుమతయ్యే, విదేశాల నుంచి దిగుమతయ్యే పార్శిళ్లను ఇక్కడే తనిఖీ చేస్తారు. అవసరమైన వాటికి కస్టమ్‌ డ్యూటీ కట్టించుకుని డెలివరీకి వీలుగా తపాలా సిబ్బందికి అందిస్తున్నారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిగా బేగంపేటలో నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌ హబ్‌ను ఏర్పాటు చేసింది. 94 దేశాలకు స్పీడ్‌ పోస్టు సేవలు అందిస్తోంది. 

మరిన్ని వార్తలు