పోస్టల్‌ బ్యాలెట్‌లో  గుర్తులుండవ్‌..

13 Nov, 2018 08:39 IST|Sakshi

సాక్షి, కాజీపేట: సాధారణంగా సర్పంచి నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల కమిషన్‌ సూచించిన ఏదో ఒక గుర్తు కేటాయిస్తారు. కానీ పోస్టల్‌ బ్యాలెట్‌లో మాత్రం గుర్తులు ఉండవు. అభ్యర్థుల పేర్లు, పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి. గతంలో బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ జరిగినప్పుడు మామూలు ఓటర్లకిచ్చే బ్యాలెట్‌ పత్రాన్నే ఉద్యోగులకు ఇచ్చేవారు.  ప్రస్తుతం ఈవీఎం యంత్రాలు రావడంతో వారికి యంత్రంలో ఓటేసే పరిస్థితి లేదు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఏర్పాటుచేశారు.

ఎన్నికల విధులకు వెళ్లే అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ సమయంలోనే పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల శిక్షణ ముగిసేలోపు వారంతా పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫాం–12 ద్వారా వారు తమ పూర్తి వివరాలు రాసి దరఖాస్తు చేసుకుంటారు. కౌంటింగ్‌లో మొదటగా పోస్టల్‌ బ్యాలెట్లనే అధికారులు లెక్కగడతారు. ఏ అభ్యర్థికి ఎన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయని లెక్కచూసిన తర్వాతే ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కిస్తారు. 

రెండో ఈవీఎం ఎప్పుడు వినియోగిస్తారంటే...
కాజీపేట: పెరిగిన సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని కొద్ది కాలంగా ప్రతి ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సుల స్థానంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక ఈవీఎంలో 64 మంది అభ్యర్థుల పేర్లను రికార్డు చేయవచ్చు. అంతకు మించి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటే రెండో ఈవీఎంను వినియోగిస్తారు. ఒక ఈవీఎంలో 3,740 ఓట్లు మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది.  
 

మరిన్ని వార్తలు