‘బతుకమ్మ’కు అంతర్జాతీయ గుర్తింపు

29 Sep, 2016 02:56 IST|Sakshi
బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి చందూలాల్. చిత్రంలో బాలకిషన్ తదితరులు

10వేల మందితో 8న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ
మంత్రి చందూలాల్ వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పండుగకు గిన్నిస్ రికార్డుల్లో చోటు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 8న ఎల్బీ స్టేడియంలో 10వేల మంది మహిళలతో బతుకమ్మ పండుగ జరుపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8న ప్రభుత్వం తరఫున ఉత్సవాలు జరుగుతాయని, 9న ప్రజలు పెద్ద బతుకమ్మను నిర్వహిస్తారన్నారు.

రాష్ట్రంలో 8న జిల్లాల్లో కూడా వెయ్యి మంది మహిళలతో ఉత్సవాలు జరుపుతారన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద 9న పెద్ద బతుకమ్మను వినాయక నిమజ్జనం తరహాలో నిర్వహిస్తామన్నారు. పండుగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. బతుకమ్మ ఉత్సవాల కోసం పాత జిల్లాలకు రూ. 10 లక్షలు, కొత్త జిల్లాలకు రూ.5 లక్షలు విడుదల చేస్తుందన్నారు. తెలంగాణ వాసులు నివసించే ముంబై, సూరత్, భీవండి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో, అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు స్థానిక సంఘాలకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుందన్నారు. 

బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నగరంలో  బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు అంజలి, షీలా తెలిపారు. సచివాలయంలో వారు మీడియా తో మాట్లాడుతూ.. అక్టోబర్ 7న రవీంద్రభారతిలో, 8న గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో, 9న ట్యాంక్‌బండ్, 10న రవీంద్రభారతి, 11న గచ్చిబౌలిలో 7 దేశాల కళాకారులతో ఉత్సవాలు జరుపుతామన్నారు. 

మరిన్ని వార్తలు