ఇదిగో.. ఇసుక దొంగలు!

31 Jan, 2018 15:10 IST|Sakshi

ఇసుకాసురుల జాబితా ప్రకటించిన అజ్ఞాతవాసి

జాబితాలో అధికార పార్టీ నాయకులు, విలేకరులు కూడా..

ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై వెలసిన పోస్టర్లు

జిల్లాకేంద్రంలో పోస్టర్లు అంటించిన గుర్తుతెలియని వ్యక్తి

సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్న వైనం..

చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనం

సిరిసిల్ల శివారులోని మానేరువాగులోంచి అక్రమంగా ఇసుక తరలించే దొంగల బండారం బయటపడింది.. నిన్నామొన్నటి దాకా గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నదెవరనేది సామాన్యులకు అంతుచిక్కకుండా ఉన్నా.. అజ్ఞాతవాసి ఒకరు ఇసుకాసురుల జాబితా వెల్లడించడం.. అదికూడా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించడం ద్వారా బహిర్గతమైంది. ఈ జాబితాలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, విలేకరులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉండడం గమనార్హం. ఈజాబితా సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఇది అసలుదా..? నకిలీదా? అనే విషయం అటుంచితే.. ఇసుక దందాపై ‘సంతకం ఏదీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సైతం సంచలనం కలించింది.

సిరిసిల్లక్రైం : ప్రభుత్వం కేటాయించిన రీచ్‌లు కాకుండా అధికార పార్టీ నాయకులు, పలుకుబడి కలిగిన నాయకులు, కొందరు వ్యాపారులు మానేరువాగులో అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసుకుని ఇసుక తవ్వేస్తున్నారు. అనుమతిలేని ప్రాంతాల్లోంచి ఇసుక దొంగచాటుగా తరలిపోతోందనే సమాచారం రెవెన్యూ, మైనింగ్, పోలీస్‌ శాఖలతోపాటు కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. కానీ, స్థానిక అవసరాల కోసం నిబంధనలకు లోబడి నిర్దేశిత సమయంలో ఇసుక రవాణాకు అవకాశం కల్పించామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే, నిర్దేశిత సమయంలో వేబిల్లు ఆధారంగా ఇసుక ట్రిప్పులు అధికంగా చేశారనే ఫిర్యాదులు అందినా.. అట్లాంటిదేమీ జరగలేదని సదరు అధికారులు ట్రాక్టర్‌ యజమానులను వెనకేసుకొచ్చినట్లు విమర్శలు వచ్చాయి.


అజ్ఞాతవాసిదే హాట్‌టాపిక్‌..
రెవెన్యూ అధికారుల సంతకాలు లేకుండా వేబిల్లు తీసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకుడి వ్యవహారంపై ‘సంతకం ఏదీ’ కథనం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితం కావడం సంచలనమే కలిగించింది. కానీ, ఇంతకన్నా మరోవాస్తవాన్ని ఓ అజ్ఞాతవాసి వాల్‌పోస్టర్ల ద్వారా బహిర్గతం చేయడం అధికారులు, అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసుక రవాణా చేస్తున్నది కేవలం ఒక వ్యక్తి కాదని, పార్టీలోని అనేక మందితోపాటు ఆర్థిక, అంగబలం ఉన్నవాళ్లు, కొందరు విలేకరులూ ఇసుకాసురులుగా అవతారం ఎత్తారని వాల్‌పోస్టర్లలో ముద్రించాడు. వీటిని సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణతోపాటు పలు ప్రధాన కూడళ్లలో అతికించాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పోస్టర్‌లోని జాబితాలో ఉన్న వ్యక్తులకు ఈ విషయం తెలియడంతో ఆత్మరక్షణలో పడిపోయారు.


విలేకరులు.. అధికార పార్టీ నేతల అండతో..
సిరిసిల్ల అర్బన్‌ మండలం పెద్దూర్, సర్ధాపూర్‌ గ్రామాల నుంచి రోజూ రాత్రి 9 –  ఉదయం 6 గంటల వరకు ఇసుక జోరుగా అక్రమంగా తరలిపోతోంది. ఇందుకు అధికార పార్టీ నాయకులు, కొందరు విలేకరుల అండ ఉంది. ఇట్లాంటి వారిపై తగిన చర్య తీసుకోవాలని అజ్ఞాతవాసి వాల్‌పోస్టర్లలో జిల్లా ఎస్పీని అభ్యర్థించడం గమనార్హం.


ఉన్నతాధికారుల ఆరా..?
అధికారుల సంతకాలు లేకుండా జారీ చేసిన వే బిల్లులు ఎలా బహిర్గతమయ్యాయనే విషయంపై రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యంగా సిరిసిల్ల ఏంఎంసీ చైర్మన్‌ పేరిట జారీ అయిన వేబిల్లుపై రెవెన్యూ సిబ్బంది, అధికారి సంతకాలు లేకుండా ఎలా బయటకు వెళ్లిందని బాధ్యులను మంగళవారం అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ఎలా సమాధానం ఇవ్వాలనే ఆలోచనలో సదరు బాధ్యులు తికమకపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

 

మరిన్ని వార్తలు