కొత్త టీచర్లు వచ్చారు

14 Jul, 2019 13:20 IST|Sakshi

235 మందికి పోస్టింగ్‌ ఆర్డర్లు 

గైర్హాజరైన 16 మంది అభ్యర్థుల ఇళ్లకు నియామక పత్రాలు 

రేపటి నుంచి విధుల్లో చేరిక 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన టీఆర్‌టీ ద్వారా ఎంపికైన స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారులు.. ఇదే రోజు నియామక పత్రాలు అందజేశారు. వీరంతా బోధనా వృత్తిలో చేరుతుండడంతో సర్కారు బడుల్లో విద్య గాడిలో పడనుంది. ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖాధికారి కె.సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా కొత్త టీచర్లు పోస్టింగ్‌ ఆర్డర్లు అందుకున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,269 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నిర్వహించిన విషయం తెలిసిందే. ఏ వివాదాలు లేని 251 స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 235 మందికి అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఇక కోర్టు వివాదాల నేపథ్యంలో 915 ఎస్‌జీటీ, 16 పీఈటీ పోస్టుల భర్తీ ప్రక్రియను పక్కనబెట్టారు. ఈ కేసు కూడా తేలితే సర్కారు బడులకు మహర్దశ పట్టనుంది. విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య పూర్తిస్థాయిలో లభించనుంది.  

గడువులోపు చేరకుంటే పోస్టింగ్‌ రద్దు.. 
టీఆర్‌టీ కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన 16 మంది అభ్యర్థుల ఇళ్లకు పోస్టింగ్‌ ఆర్డర్లను పోస్టు ద్వారా జిల్లా విద్యాశాఖ పంపనుంది. 15 రోజుల్లోపు వీరు తమకు కేటాయించిన స్కూళ్లలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు విధుల్లో చేరకుంటే ఆ పోస్టింగ్‌లను రద్దు చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి కె.సత్యనారాయణ రెడ్డి తెలిపారు.  

వీవీల సేవలకు స్వస్తి 
తాజాగా ఆయా బడులకు శాశ్వత టీచర్లు రానుండడంతో.. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న విద్యా వలంటీర్లను తొలగించనున్నారు. వీవీల నియామక సమయంలోనూ ఈమేరకు ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. శాశ్వత టీచర్లు విధుల్లోకి వచ్చేవరకు పనిచేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత విధులకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందని వీవీలకు విద్యాశాఖ అధికారులు కూడా వివరించారు. ఈ నేపథ్యంలో దాదాపు 200 పైచిలుకు వీవీలు తప్పుకోనున్నారు. అయితే, వీరిని ఖాళీలు ఉన్న బడుల్లో సర్దుబాటు చేస్తారా? లేదా.. లేకా విధుల నుంచి తొలగిస్తారా.. అనే విషయం తేలాల్సి ఉంది. ఈ విషయమై పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు లేఖ రాస్తామని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.  

రోస్టర్‌ లొల్లి 
స్కూళ్ల కేటాయింపులో రోస్టర్‌ విధానం పాటించకపోవడంపై కొందరు అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం మెరిట్‌ ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇవ్వడంతో వెనుకబడిన, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల్లోని పాఠశాలల్లో పోస్టింగ్‌లు దక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్‌ విధానం పాటించి ఉంటే సమీపంలోని స్కూళ్లను ఎంపిక చేసుకునే అవకాశం దక్కేదని భావిస్తున్నారు. అయితే, మరోపక్క ప్రభుత్వం సూచించిన నియమనిబంధనల ప్రకారమే అభ్యర్థులకు పోస్టింగ్‌లు దక్కాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.    

మరిన్ని వార్తలు