కమిటీలేవీ... అధ్యక్షా !

23 May, 2015 02:03 IST|Sakshi
కమిటీలేవీ... అధ్యక్షా !

రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో నియామకాలు ఎప్పుడు
జిల్లాల్లోనూ ఏర్పాటుకాని కార్యవర్గాలు
నామినేటెడ్ పదవులు ఎలాగూ లేవు.. పార్టీ పదవులన్నా ఇవ్వరా..
పదవుల కోసం టీఆర్‌ఎస్ నేతల ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ నేతలను కదిలిస్తే చాలు నిర్వేదం ప్రకటిస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీకి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది.

ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ కాలేదన్న అసంతృప్తి వారిలో తీవ్రంగా ఉంది. చివరకు పార్టీ ప్లీనరీ జరిగి మరో రోజు గడిస్తే సరిగ్గా నెల రోజులు. కానీ, ఇప్పటికీ పార్టీ కమిటీల నియామకాలు పూర్తి కాలేదు. ‘నామినేటెడ్ పదవులు ఎలా గూ లేవు, అవి ఎప్పుడు భర్తీ అవుతాయో ఏమో .. కనీసం పార్టీ పదవులన్నా ఇవ్వారా..’ అంటూ ఆవేదన వెల్లగక్కుతున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేయలేదు.

పార్టీ అనుంబంధ విద్యార్ధి, యువజన, మహిళ, కార్మిక సంఘాల కమిటీలదీ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షున్ని గత నెల 24వ తేదీన జరిగిన పార్టీ  ప్లీనరీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం కె. చంద్రశేఖర్‌రావు మరో మారు పార్టీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత ఆయనే రాష్ట్ర కమిటీని ప్రకటించాలి. దీంతోపాటు పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయాలి. ఇలా ఈ నియామకాల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
 
పదవుల కోసం ఎదురు చూపులు
ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, కేబినెట్‌లో స్థానం పొందిన మంత్రులు మినహాయిస్తే పార్టీ కోసం పనిచేసిన వారెవరికీ ఎలాంటి పదవుల్లేకుండా పోయాయి. ఈ నిరాశ పార్టీ శ్రేణు ల్లో బాగా పేరుకుంది. నామినేటెడ్ పదవులు భర్తీపై ఊరడింపులు మినహా అమలు కాలేదు. వాటిపై ఆశలు ఆవిరైన వారు, కనీసం పార్టీసంస్థాగత పదవులైనా భర్తీ అవుతాయని ఎదురు చూశారు.  ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేర్లతో ప్రతిపాదనలు ఇస్తే కానీ కమిటీలను భర్తీ చేయలేని నిస్సహాయ స్థితిలో జిల్లా అధ్యక్షులు ఉన్నారని చెబుతున్నారు.

మెజారిటీ నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల గొడవలు ఉన్నాయి. గ్రామ, మం డల, నియోజకవర్గ స్థాయి ఎన్నికల్లో అవి స్పష్టంగా కనిపించాయి. జిల్లా కమిటీలను భర్తీ చేయాలన్నా అదే పరిస్థితి తలెత్తవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్యా ఎక్కువగానే ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోచన ఉండడంతో, రాష్ట్ర కమిటీ భర్తీని ఆలస్యం చేస్తున్నారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

ఇక, పార్టీ అత్యున్నత విభాగమైన పొలిట్‌బ్యూరో నియామకం కూడా అందుకే ఆలస్యమవుతోందని సమాచారం. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ సభ తర్వాత పార్టీ శిక్షణ కార్యక్రమం ఉండడంతో ఆలస్యమైందని చెబుతున్నా, అసలు కారణం తెలియడం లేదంటున్నవారే ఎక్కువ. సాహసించి ఎవరూ నోరు మెదపడం లేదు కానీ, పార్టీ పదవులన్నా భర్తీ చేసి అవకాశం కల్పించాలన్న డిమాండ్ బలంగా వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు