మండే ఎండ.. కుండే అండ

28 Feb, 2017 11:01 IST|Sakshi
► ఇన్ముల్‌నర్వలో ఊపందుకున్న విక్రయాలు
ఇన్ముల్‌నర్వ (కొత్తూరు): 
పేదోడికి వేసవికాలం వచ్చిందంటే చాలు మట్టికుండలు గుర్తుకొస్తాయి. పేదలతో పాటు వైద్య పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ వైద్యులు సూచించిన మేరకు ఫ్రిజ్‌ కంటే ఎక్కువగా వేసవిలో మట్టి కుండలోని చల్లటి నీటిని తాగేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముందుగానే తమ ప్రతాపాన్ని చూపడంతో ప్రజలు ఉక్కపోత, దాహంతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా వివిధ పనులపై బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరుకోగానే ఉక్కపోతల కారణంగా చల్లని నీటిని తాగేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. దీంట్లో భాగంగానే వేసవి దృష్ట్యా మార్కెట్లో ఫ్రిజ్‌ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పేదలు కుమ్మరులు తయారు చేసిన  కుండలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
 
ముఖ్యంగా ఫ్రిజ్‌లో చల్లబర్చే నీటి కంటే మట్టి కుండలోని నిల్వ ఉన్న నీటిని తాగితే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సైతం పలు సందర్భాల్లో సూచిస్తున్నారు. ధరలు తక్కువగా ఉండడంతో పేదలతో పాటు వ్యాపారులు కూడా ప్రకృతి సహజ సిద్దంగా తయారు చేసిన కుండలను ఎక్కువగా కొనుగోలు ఆసక్తి కనబర్చుతున్నారు. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కుమ్మరులు కూడా యంత్రాలకు పోటీగా తమ హస్త నైపుణ్యంతో పలు రూపాల్లో కుండలను తయారు చేస్తున్నారు. కుండల రకాలను, సైజులను బట్టి రూ. 50 నుండి రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. 
 
ప్రోత్సాహం లేక తగ్గుతోన్న ఆదరణ 
మండలంలో ఒకప్పుడు ప్రతి గ్రామంలో కుమ్మరులు కుండలు తయారు చేస్తూ తమ కులవృత్తిపై ఆధారపడి జీవిస్తుండేవారు. కాగా మండలంలో వచ్చిన రియల్‌బూమ్, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం ఇన్ముల్‌నర్వ, సిద్ధాపూర్‌ గ్రామాల్లో మాత్రమే కుండలను తయారు చేస్తున్నారు. ఇన్ముల్‌నర్వ గ్రామంలో తయారు చేసే కుండలను వారు సమీపంలో జేపీ దర్గా ఆవరణలో విక్రయిస్తుంటారు.ఇక్కడ స్థానికులే కాకుండా హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంతో ఇష్టంగా మట్టికుండలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. దీంతో పలువురికి కుండల తయారీ ద్వారా ఉపాధి లభిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలగర్భంలో కలిసిపోతున్న కులవృత్తులకు తగిన ప్రోత్సాహం అందించాలని కుమ్మరులు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు