గట్టెక్కేదెలా?

4 Jan, 2019 09:22 IST|Sakshi

ఆర్థిక కష్టాల్లో జలమండలి విద్యుత్‌ బకాయిలు రూ.450 కోట్లు

బోర్డు నెలవారీ ఖర్చు రూ.115 కోట్లు పైనే..  

నెలవారీ ఆదాయం మాత్రం రూ.95 కోట్లు  

ప్రభుత్వం కరుణిస్తే ఓకే.. లేకుంటే ‘నష్ట’కాలమే

సాక్షి,సిటీబ్యూరో: భారీగా పేరుకుపోయిన విద్యుత్‌ బిల్లుల బకాయిలు జలమండలి పుట్టి ముంచుతున్నాయి. ఇప్పటికే రూ.450 కోట్ల మేర బిల్లులు పేరుకుపోవడంతో పాటు, బకాయిలపై అపరాధ వడ్డీ 11 శాతం వడ్డించడంతో వాటర్‌ బోర్డుకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. మెట్రోరైలు తరహాలో బోర్డుకు రాయితీ ధరపై విద్యుత్‌ సరఫరా చేయాలన్న ఫైల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ వద్ద ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంది. దీంతో అధిక విద్యుత్‌ బిల్లులు.. కొండలా పేరుకుపోయిన బకాయిలుసంస్థను రూకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నాయి.

విద్యుత్‌ రాయితీకి మోక్షమెప్పుడు?  
జలమండలికి ప్రస్తుతం విద్యుత్‌శాఖ వాణిజ్య విభాగం కింద విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో ప్రతి యూనిట్‌కు రూ.6–7 వరకు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మెట్రో రైలు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి మాత్రం రాయితీపై యూనిట్‌ విద్యుత్‌ను రూ.3.95కే సరఫరా చేస్తోంది. ఈ తరహాలోనే జలమండలికి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో సూత్రప్రాయంగా అంగీకరించింది. సంబంధిత ఫైలు ప్రస్తుతం విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ వద్ద ఉంది. తక్షణం దీనికి మోక్షం లభిస్తేగాని జలమండలికి ఊరట లభించే పరిస్థితి లేదు. ఈ ఫైలు ఓకూ అయితే బోర్డుకు నెలవారీగా రూ.25 కోట్లు.. ఏడాదికి రూ.300 కోట్ల మేర విద్యుత్‌ బిల్లుల రూపేణా ఆదా అవుతుంది. ఈ ఫైలుకు తక్షణం మోక్షం కల్పించి బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

ప్రతీనెలా ఆర్థిక కష్టాలే..
జలమండలికి నెలవారీగా రూ.95 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు అవసరమైన పంపింగ్‌ కేంద్రాలు, నగరం నలుమూలలా నీటి సరఫరాకు వినియోగించే పంపులకు సంబంధించి నెలవారీగా రూ.75 కోట్లు విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇక మిగతా రూ.20 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లుగా చెల్లిస్తున్నారు. ఇక  నగరంలో మురుగునీటి పారుదల, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులకు, గతంలో కృష్ణా, గోదావరి పథకాలకు తీసుకున్న రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకు మరో రూ.15–20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో నెలవారీ వ్యయం రూ.110–115 కోట్లకు చేరుతోంది. అంటే నెలకు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు బోర్డుకు నష్టాలు తప్పడంలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన రూ.1000 కోట్ల నిధులను సైతం త్రైమాసికాల వారీగా సక్రమంగా కేటాయింపులు జరపకపోవడం శాపంగా పరిణమిస్తోంది. గతంలో జలమండలికి హడ్కో అందించిన రూ.300 రుణ మొత్తాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లించింది. ఈ చెల్లింపులు కూడా ఇప్పటి వరకు పూర్తికాలేదని సమాచారం. హడ్కో రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్‌ గ్రాంటు చెల్లింపులు కూడా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. 

సరఫరా నష్టాలు అదనం
వాటర్‌ బోర్డు రోజువారీగా 440 మిలియన్‌ గ్యాలన్ల జలాలను కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరించి శుద్ధిచేసి నగర ప్రజల అవసరాలకు సరఫరా చేస్తోంది. ప్రతి వేయిలీటర్ల నీటి శుద్ధికి రూ.40 ఖర్చు చేస్తున్నప్పటికీ.. వినియోగదారులకు రూ.10కే తాగునీటిని అందిస్తోంది. ఇక సరఫరా చేస్తున్న నీటిలోనూ లీకేజీలు, చౌర్యం, ఇతరత్రా కారణాలతో సరఫరా నష్టాలు 40 శాతం ఉంటున్నాయి. అక్రమ నల్లాలు, కోట్లలో పేరుకుపోయిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నీటిబిల్లు బకాయిలు జలమండలికి ఆర్థిక కష్టాలనే మిగిలిస్తుండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు