‘పుర’ ఎన్నికల ట్రిబ్యునల్‌!

15 Feb, 2020 02:03 IST|Sakshi

ట్రిబ్యునల్‌కు ఎన్నికను రద్దు చేసే అధికారం 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ ఇకపై నేరుగా హైకోర్టులో పిటిషన్లు వేసేందుకు అవకాశం లేదు. ఫలితాలపై అభ్యంతరాలుంటే తొలుత ఎన్నికల ట్రిబ్యునల్‌కు వెళ్లాల్సిందే. ట్రిబ్యునల్‌ తీర్పును మాత్రం రాష్ట్ర హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్ల విచారణ కోసం ‘తెలంగాణ మున్సిపాలిటీల నిబంధనలు (ఎన్నికల పిటిషన్లు)–2020’పేరుతో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలోని నిబంధనల మేరకు ఈ మార్గదర్శకాలకు రూపకల్పన చేశారు. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు మార్గదర్శకాలు వర్తించనున్నాయి. 
- ఫలితాల ప్రకటించిన 30 రోజుల్లోగా ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేయాలి. జాప్యానికి పిటిషనర్‌ సరైన కారణాలను చూపితే ట్రిబ్యునల్‌ మరో 15 రోజుల గడువు ఇవ్వనుంది.  
- మున్సిపాలిటీ ఏ ఆ జిల్లా పరిధిలోకి వస్తే ఆ జిల్లా జడ్జి ట్రిబ్యునల్‌ నిర్వహించనున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది జిల్లా జడ్జిల పరి ధిలో మున్సిపాలిటీ ఉంటే, ప్రిన్స్‌పల్‌ జిల్లా జడ్జి ట్రిబ్యునల్‌ను నిర్వహించనున్నారు.  
-  పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్లు, ఇంకెవరైనా పిటిషన్‌ దాఖలు చేయొచ్చు.  
- గెలిచిన అభ్యర్థి ఎన్నిక చెల్లదని అభ్యర్థించొ చ్చు. లేదా గెలిచిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేసి తనను లేదా ఇతర అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని పిటిషన్‌ దాఖలు చేయొచ్చు. 
- పిటిషన్‌లో ఆరోపణలకు పూర్తి వివరాలు ఉండాలి. ఒక్కో ఘటనను ఒక్కో పేరాలో క్రమ సంఖ్యలతో వివరించాలి.  
- మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికలపై పిటిషన్‌ దాఖలు చేసేందుకు రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా ట్రిబ్యునల్‌లో జమ చేయాల్సి ఉంటుంది. కార్పొరేటర్, కౌన్సిలర్‌ ఎన్నికలను సవాల్‌ చేసేందుకు రూ.5 వేలు జమ చేయాలి. 
-  పిటిషన్లను తిరస్కరించే అధికారం ట్రిబ్యునల్‌దే  
- లంచాలు, ఇతరత్రా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం/ వర్గవైషమ్యాలను రెచ్చగొట్టి భయాందోళనకు గురి చేయడం వల్ల ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదని ట్రిబ్యునల్‌ నిర్ధారణకు వస్తే ఎన్నికలను రద్దు చేయొచ్చు. 
-  అక్రమ పద్ధతి ద్వారా ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తే ఎన్నికను రద్దు చేస్తారు. 
-  అభ్యర్థి లేదా ఏజెంటు సూచనల మేరకు స్వయంగా అభ్యర్థి లేదా ఏజెంటు లేదా ఎవరైన ఇతర వ్యక్తి అక్రమాలకు పాల్పడినా ఎన్నికను రద్దు చేస్తారు. 
-  నిబంధనలకు విరుద్ధంగా ఏదైన ఓటును తిరస్కరించడం వల్ల లేదా చెల్లుబాటు కాని ఓటు ను లెక్కించడం వల్ల ఫలితాలు తారుమార యితే ఫలితాలను రద్దు చేస్తారు. 
-  ఎన్నికల రోజు నాటికి అనర్హుడైన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించినా ఎన్నికలను రద్దు చేస్తారు. 
- విచారణ పూర్తయిన రోజు నుంచి 14 రోజుల్లోగా గెలిచిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయడంతో పాటు పిటిషనర్‌ లేదా ఇతర అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ లేదా మళ్లీ ఎన్నికలు నిర్వ హించాలని ఆదేశిస్తూ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. 
-  ట్రిబ్యునల్‌ నిర్ణయాన్ని 30 రోజుల్లోగా హైకోర్టులో సవాల్‌ చేయొచ్చు. అప్పీల్‌ చేయని పక్షంలో ట్రిబ్యునల్‌ తీర్పే తుది నిర్ణయం.

>
మరిన్ని వార్తలు