విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన వాయిదా

16 Feb, 2020 03:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వార్షిక ఆదాయ అవసరాలను (ఏఆర్‌ఆర్‌) తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ)కి విద్యుత్‌ పంపిణీ సంస్థలు సకాలంలో దాఖలు చేయకపోవడంతో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతానికి వాయిదా పడింది. ఏఆర్‌ఆర్‌ను దాఖలు చేయడానికి ముందే విద్యుత్‌ చార్జీలు పెంచాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) భావించి, సీఎం ఆమోదం పొందేందుకు ప్రయత్నించాయి. అయితే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో ఏఆర్‌ఆర్‌ సమర్పణకు మరికొంత కాలం గడువు ఇవ్వాలని ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావును కోరగా, అందుకు అనుమతిచ్చినట్లు తెలిసింది. 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను ఏఆర్‌ ఆర్‌ను డిస్కమ్‌లు శనివారం ఈఆర్‌సీకి సమర్పిస్తాయనే ప్రచారం జరిగింది.

2019–20లో రూ.11వేల కోట్లు, 2020–21లో రూ.12వేల కోట్లు ఆదాయ లోటు ఉంటుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి. మరోవైపు వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.13వేల కోట్ల బకాయిలను డిస్కమ్‌లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ చార్జీలను సవరించాలని ఈఆర్‌సీ స్టేట్‌ అడ్వైజరీ కమిటీలో కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ శాఖల బకాయిలు విడుదల కాకపోవడం, చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వక పోవడాన్ని సంఘాలు తప్పు పట్టాయి. ఇదిలా ఉంటే ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మార్చి 1 వరకు సెలవులో ఉండటంతో, ఆయన విధుల్లో చేరిన తర్వాత డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేస్తాయని సమాచారం.   

మరిన్ని వార్తలు