విద్యుత్ ‘చార్జ్’

28 Mar, 2015 01:03 IST|Sakshi
విద్యుత్ ‘చార్జ్’

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి కరెంట్ చార్జీల పెంపు
 సగటున 4.4 శాతం మోతకు ఈఆర్సీ ఆమోదం
 ప్రజలపై రూ. 816 కోట్ల భారం.. పేదలకు ఊరట
 200 యూనిట్ల వరకు పాత చార్జీలు.. ఆపై బాదుడే
 పరిశ్రమలకు 5 శాతం పెంపు
 వ్యవసాయ వినియోగ లెక్కలకు ఈఆర్సీ కత్తెర
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల మోత మోగింది. ప్రస్తుత విద్యుత్ చార్జీల మీద సగటున 4.42 శాతం పెంపునకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రజలపై రూ.816 కోట్ల భారం పడనుంది. ఫిబ్రవరి 7న విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి సమర్పించిన చార్జీల ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను పరిశీలించిన ఈఆర్సీ... ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఈ కొత్త చార్జీలను ప్రకటించింది.
 
  అయితే డిస్కంలు చేసిన పలు ప్రతిపాదనలను ఈఆర్సీ అంగీకరించలేదు. గృహ వినియోగదారులకు సంబంధించి 100 యూనిట్ల లోపు వరకు చార్జీల పెంపును డిస్కంలే మినహాయించాయి. ఆపైన పెంపును కోరాయి. కానీ ఈఆర్సీ మాత్రం నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారికి కూడా భారం పడకుండా మినహాయింపునిచ్చింది. దీంతో 200 యూనిట్లకు మించితే చార్జీ మోత మోగడం ఖాయమైంది. ఇక వ్యవసాయ, కుటీర పరిశ్రమలకు చార్జీలు పెంచకుండా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం ఆ వర్గాలకు ఊరటనిచ్చింది. మిగతా వ్యాపార, వాణిజ్య కేటగిరీలన్నింటా చార్జీల పెంపు ఉంది.  టెలిస్కోపిక్ విధానం కాబట్టి శ్లాబ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీల లెక్కింపు ఉంటుంది. మొత్తంగా గృహాల కేటగిరీలో సగటున 1.3 శాతం చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 1,088.68 కోట్ల పెంపును ప్రతిపాదిస్తే... ఈఆర్సీ రూ. 272.68 కోట్ల మేరకు తగ్గించి.. రూ. 816 కోట్ల భారానికి పచ్చజెండా ఊపింది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ప్రార్థన మందిరాలన్నింటికీ చార్జీలు పెంచింది. పరిశ్రమల కేటగిరీల్లో సగటున 5 శాతం చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో 200 వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు దాదాపు 80 లక్షలు ఉన్నాయి. వారికి ప్రస్తుత భారం నుంచి ఉపశమనం లభించినట్లే. అంతకు మించి విద్యుత్ వినియోగించే 8 లక్షల కుటుంబాలపై పెంపుతో భారం పడుతుంది.
 
 80 లక్షల ఇళ్లకు ఉపశమనం..
 
 రాష్ట్రంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.20 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయని ఈఆర్సీ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 88 లక్షల కనెక్షన్లు గృహ వినియోగదారులే. అంటే వారందరిపై చార్జీల భారం ఉండదని టీఎస్‌ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ప్రకటించారు. చైర్మన్‌తో పాటు ఈఆర్సీ సభ్యులు హెచ్.శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి శుక్రవారం కొత్త విద్యుత్ చార్జీలను వెల్లడించారు. వ్యవసాయ, కుటీర పరిశ్రమలను పెంపు నుంచి మినహాయించడంతో 18 లక్షల మందిపై ప్రభావం ఉండదని వారు చెప్పారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహేతర చిరు వ్యాపారులు, దుకాణాలకు సంబంధించి 10.6 లక్షల కనెక్షన్లు ఉన్నాయని, వీటిలో 6 లక్షల కనెక్షన్లకు చార్జీల పెంపు భారమేమీ ఉండదని తెలిపారు. మొత్తంగా ప్రస్తుతమున్న చార్జీలతో పోలిస్తే 4.4 శాతం చార్జీలు పెరిగాయని.. గృహాల కేటగిరీలో కేవలం 1.3 శాతం పెరిగాయని ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్‌పీడీసీఎల్), దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) సమర్పించిన ఆదాయ వ్యయ నివేదికలు, కొత్త చార్జీల ప్రతిపాదనల ప్రకారం.. వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు 4 నుంచి 5.75 శాతం వరకు ఉంది.
 
 
 సర్కారు సబ్సిడీ రూ. 4,227 కోట్లు..
 
 రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,473.76 కోట్లు అవసరమని ఏఆర్‌ఆర్ నివేదికల్లో ప్రతిపాదించాయి. కానీ ఈఆర్సీ రూ. 23,416 కోట్లకు దీనిని కుదించింది. మొత్తం రూ. 6,476.23 కోట్ల లోటు ఉందని డిస్కంలు ఏఆర్‌ఆర్ నివేదికల్లో పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి రూ. 5,387.55 కోట్ల సబ్సిడీ ఆశిస్తూ... రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా పూడ్చుకోవడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. అయితే ప్రభుత్వం రూ. 4,227 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. కోళ్ల పరిశ్రమకు అదనంగా ఇచ్చిన రూ. 30 కోట్ల సబ్సిడీని నేరుగా చార్జీలలోనే సర్దుబాటు చేసింది. వీటికి యూనిట్‌కు రూ. 5.63 చొప్పున ఉన్న చార్జీని ఏకంగా రూ. 2.03కు తగ్గించింది. అయితే కొత్త టారిఫ్‌లో పౌల్ట్రీ ఫారాలకు రూ. 3.60 చొప్పున చార్జీ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్ వినియోగం డిస్కం లు అంచనా వేసినంతగా ఉండదని ఈఆర్సీ అభిప్రాయపడింది. సర్కారు ఇస్తున్న సబ్సిడీ సరిపోతుందని పేర్కొంటూ... కేటగిరీల వారీగా వ్యవసాయ విద్యుత్ వినియోగ లెక్కలను తగ్గించింది. డిస్కంలు 13,431 మిలియన్ యూనిట్లు అవసరమని అంచనా వేసుకోగా.. ఈఆర్సీ భారీగా కత్తెర పెట్టి 10,650 మిలియన్ యూనిట్లు సరిపోతుందని స్పష్టం చేసింది. ఇందులో ఎన్‌పీడీసీఎల్‌కు 4,300 మిలియన్ యూనిట్లు, ఎస్‌పీడీసీఎల్‌కు 6,350 యూనిట్లు సరిపోతుందని పేర్కొంది. రూ. 3,789 కోట్లలోటు చూపిన ఎన్‌పీడీసీఎల్‌కు రూ. 3,529 కోట్లు ప్రభుత్వ సబ్సిడీ అందుతుందని, రూ. 2,687 కోట్లలోటు చూపిన ఎస్‌పీడీసీఎల్‌కు రూ. 698 కోట్లు సబ్సిడీ అందుతుందని ఈఆర్సీ వెల్లడించింది.
 
 ప్రస్తుత, ప్రతిపాదిత
 చార్జీలతో భారం (రూ.లలో)
 యూనిట్లు    ప్రస్తుత చార్జీ    ప్రతిపాదిత చార్జీ
 100    202.50    202.50
 200    620    620
 201    670.38    826.80
 250    983    1,160
 300    1,327    1,525
 400    2,065    2,305
 పెంపుతో ఆదాయ, వ్యయాలు (రూ. కోట్లలో)
 2015-16లో రాబడి అంచనా    23,416
 ప్రస్తుత చార్జీలతో ఆదాయం    18,373
 చార్జీల పెంపుతో వచ్చే రాబడి    1,816
 ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ    4,227

 


 

మరిన్ని వార్తలు