విద్యుత్‌ వైర్లకు చిక్కుముడి

14 Jan, 2019 10:43 IST|Sakshi

11కేవీ విద్యుత్‌ లైన్ల మధ్య చిక్కుకున్న చైనా మాంజా

తీగలు రాసుకుని విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

వంద ఫీడర్ల పరిధిలో నిలిచిన సరఫరా..

ఇంజనీర్లకు తప్పని తంటాలు

సాక్షి, సిటీబ్యూరో: చైనా మాంజా కేవలం పావురాలు, ఇతర పక్షులనే కాదు...విద్యుత్‌ వైర్లను సైతం వదలడం లేదు. పతంగులు విద్యుత్‌ వైర్ల మధ్య చిక్కుకోవడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్‌ పరిధిలో ఆదివారం ఒక్క రోజే వంద పీడర్ల పరిధిలో ఇదే కారణంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కందికల్‌గేట్‌ సమీపంలోని విద్యుత్‌ వైర్లకు ఆదివారం ఉదయం చైనామాంజా చిక్కుకుని, షార్ట్‌సర్క్యూట్‌ తలెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీల్లో దాదాపు గంటన్నర పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో డిస్ట్రిబ్యూషన్‌ లైన్ల మధ్య పతంగి చిక్కడంతో ఇదే సమస్య తలెత్తింది. మూసీ పరివాహాక ప్రాంతంలోని చాదర్‌ఘాట్, ఇమ్లీబన్‌ బస్టేషన్, గోల్నాక, అంబర్‌పేట్, రామంతాపూర్, నాగోల్, నందనవనం, లెనిన్‌నగర్, పద్మారా వున గర్, సికింద్రాబాద్, వారసిగూడ, తార్నాక, నల్లకుంట, చాంద్రాయణగుట్ట, చిలుకలగూడ, లాలాపేట్, ఉప్పల్‌ తది తర ప్రాంతాల్లో వెలుగు చూసి న విద్యుత్‌ సరఫరాలకు ఇదే కారణంగా తేలింది. 

గట్టిగా కిందకు లాగడంతో...
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 10 తేదీ నుంచి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి సెలవుల్లో పిల్లలు ఇంటిపై నిలబడి పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్‌ చేయడం అందరికీ తెలిసిందే. పిల్లలు ఆనందంతో ఎగరేసే పతంగుల్లో చాలా వరకు వైర్ల మధ్య చిక్కుకుంటున్నాయి. చైనా మాంజాతో పతంగ్‌లు తయారు చేయడం, వైర్ల మధ్య చిక్కుకున్న పతంగ్‌లను విడిపించుకునేందుకు పిల్లలు వాటిని గట్టిగా కిందికి లాగుతుంటారు. ఇలా లాగే క్రమంలో అప్పటి వరకు దూరంగా ఉన్న వైర్లు ఒకదానికొకటి ఆనుకుని, విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగుతున్నాయి. వైర్ల మధ్య రాపిడి కారణంగా హైఓల్టేజ్‌ సమస్య తలెత్తి..ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సమీపంలోని డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై ఫీజులు కాలిపోతుండటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. డిమాండ్‌కు తగినంత సరఫరా ఉన్నప్పటికీ...మాంజా వల్ల తరచూ కరెంట్‌ సరఫరా నిలిచిపోతుండటంతో ఏం చేయాలో తెలియక ఇంజినీర్లు తలపట్టుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలతో పోలిస్తే...ఇరుకైన వీధులు ఎక్కువగా ఉండే మురికివాడలు, ఇతర బస్తీల్లోనే ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోందని బంజారాహిల్స్‌ ఎస్‌ఈ ఆనంద్‌ పేర్కొన్నారు. 

లైన్ల కింద పతంగులు ఎగరెయొద్దుః విద్యుత్‌లైన్ల కింద పతంగులు ఎగరేయడం వల్ల మాంజా వైర్లకు చుట్టుకుని పిల్లలు విద్యుత్‌షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. చెట్ల కొమ్మల మధ్య, విద్యుత్‌ వైర్ల మధ్య చిక్కుకున్న వాటిని తీసేందుకు యత్నించడం కంటే..వాటిని అలాగే వదిలేయడం ఉత్తమం. వైర్లకు చుట్టుకుపోయిన చైనామాంజాను గట్టిగా లాగే సమయంలో ఒకదానికొక వైరు ఆనుకుని..మంటలు ఎగిసిపడే అవకాశం ఉంది. లైన్లకింద ఆడుకుంటున్న పిల్లలపై ఈ నిప్పులు కురవడంతో వారు గాయపడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు పిల్లలు లైన్ల కిందకాకుండా ఖాళీగా ఉన్న క్రీడామైదానాల్లో పతంగులు ఎగరేసుకోవాలి. ఎవరికి వారుగా కాకుండా సమూహంగా పతంగులు ఎగరేయడంద్వారా పిల్లల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. ఇం టిపై నిలబడి పతంగులు ఎగరేయడం కన్నా ..ఖాళీ మైదానంలో నిలబడి పతంగ్‌లు ఎగరేయ డం ద్వారా ఎక్కువ ఆనందం ఉంటుంది.–ఏజీ రమణప్రసాద్,ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ ఆఫ్‌ తెలంగాణ

మరిన్ని వార్తలు