మండపాల వద్ద జర జాగ్రత్త!

2 Sep, 2019 10:31 IST|Sakshi

వినాయక మండపాల వద్ద పొంచి ఉన్న విద్యుత్‌ ప్రమాదం

జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్‌ తనిఖీ విభాగం సూచన

సాక్షి, సిటీబ్యూరో: గణేష్‌ ఉత్పవాల్లో భాగంగా ఇంట్లోనే కాకుండా వీధుల్లోనూ, అపార్ట్‌మెంట్లలోనూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం అనవాయితీ. నిర్వాహకులు వీధుల్లో పెద్దపెద్ద మండపాలతో పాటు భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. మండపాన్ని వివిధ లైట్లతో అందంగా అలంకరిస్తుంటారు. అపార్ట్‌మెంట్, కాలనీవాసులంతా ప్రతిరోజూ సాయంత్రం తమ కుటుంబ సభ్యులతో కలిసి మండపాల వద్దకు చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. లైటింగ్‌ కోసం తాత్కాలికంగా విద్యుత్‌ కనెక్షన్లను తీసుకుంటారు. తాత్కాలికంగా మండపాల్లో స్విచ్‌బోర్డులు ఏర్పాటు చేసి, ఒకే ప్లగ్‌ నుంచి లైటింగ్, సౌండింగ్‌ కోసం కనెక్షన్లు ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్‌ కనెక్షన్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా..విద్యుత్‌షాక్‌ తగిలి.. మృత్యువాతపడే ప్రమాదం లేకపోలేదని తెలంగాణ విద్యుత్‌ తనిఖీ విభాగం ప్రధాన అధికారి బి.సత్యనారాయణరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే...
మండపాలకు గుర్తింపు ఉన్న ఎలక్ట్రీషియన్‌తోనే విద్యుత్‌ పనులు చేయించుకోవాలి.
మండపంలో ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన స్విచ్‌ బోర్డులు, ప్లగ్‌లు, కేబుళ్లను మాత్రమే వాడాలి.
ఎర్త్‌ లీకేజ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌(ఈఎల్‌సీబీ)లను ఏర్పాటు చేసుకోవాలి.
లోడును బట్టి..2.5 స్వై్కర్‌ ఎంఎం వైర్‌ను వాడాలి.
దేనికి ఎంత విద్యుత్‌ ఖర్చు అవుతుందో ముందే ఒక అంచనాకు వచ్చి ఆ సామర్థ్యం గల వైర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు 10 ఏఎంపీఎస్‌ విద్యుత్‌ ఉపయోగించే చోట 20 ఏఎంపీఎస్‌ విద్యుత్‌ భారం పడే లైట్లు ఉపయోగిస్తే అధిక ఒత్తిడి వల్ల వైర్లు కాలిపోయే ప్రమాదం ఉంది.  
ఒకే స్విచ్‌బోర్డుకు ఎక్కువ ప్లగ్‌లు ఉపయోగించడం వల్ల షార్ట్‌సర్క్యూట్‌లు జరిగే ప్రమాదం ఉంది.  
విద్యుత్‌ కనెక్షన్లను తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి.  
సాధ్యమైనంత వరకు వైర్లకు జాయింట్స్‌ లేకుండా చూసుకోవాలి. ఒక వేళ ఉంటే వాటిని టేప్‌తో అతికించి కాళ్లు, చేతులకు తాకకుండా జాగ్రత్తపడాలి.  
ప్రతి మండపంలోనూ విధిగా ఐదు కేజీల కార్బన్‌డైయాక్సైజ్‌ ఫైర్‌సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయాలి. బకెట్లో ఇసుక నింపి ఉంచుకోవాలి. 

మరిన్ని వార్తలు