నీలగిరిపై.. ‘కమలాస్త్రం’

31 May, 2016 03:05 IST|Sakshi
నీలగిరిపై.. ‘కమలాస్త్రం’

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తొలి అస్త్రాన్ని జిల్లాపైనే ప్రయోగించనుంది. తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే తొలి బహిరంగసభకు సూర్యాపేట వేదిక కానుంది. అమిత్‌షా జూన్ పదో తేదీన సూర్యాపేటలో జరగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో ఈసభను విజయవంతం చేసేందుకు స్థానిక కమలనాథులు అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించారు.

2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను క్రియాశీలకం చేయడంతోపాటు రెండేళ్ల మోడీ పాలన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు  సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ బహిరంగసభ ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం సూర్యాపేటలో పార్టీ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు.

తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే బహిరంగసభను జయప్రదం చేయడం ద్వారా జిల్లాలో తమకున్న బలాన్ని నిరూపిస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు కనీసం 60వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ఇందులో మన జిల్లా నుంచే 40వేల మంది ప్రజలను కదిలిస్తామని వారు అంటున్నారు. పొరుగున ఉన్న జిల్లాల నుంచి పార్టీ కేడర్ వస్తుంది కనుక మొత్తం మీద 60వేల మందికి తగ్గకుండా బహిరంగసభను నిర్వహించి తమ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
 
హైదరాబాద్ సభ మరుసటి రోజే...
సూర్యాపేటలో అమిత్‌షా బహిరంగ సభకు సంబంధించిన పరిణామాలు వడివడిగా జరిగిపోయాయి. ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన మండల ప్రతినిధుల సభ ముగిసిన 24 గంటల్లోపే జిల్లాలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. అసోం రాష్ట్రంలో లభించిన ఘన విజయాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేయాలని, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మొదటి టార్గెట్‌గా పెట్టుకుంటామని హైదరాబాద్ సభలో చెప్పిన కమలనాథులు.. వెంటనే జిల్లాలో బహిరంగసభను ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

అమిత్‌షా పాల్గొన్న ఈ మండల ప్రతినిధుల సభకు జిల్లా నుంచి రెండు వేల మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సభలో బీజేపీ సారధి ఇచ్చిన ప్రసంగంతోకమలానాథులు నూతనోత్తేజం పొందారు. మళ్లీ జిల్లాలో అమిత్‌షా బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి రావడంతో దాన్ని విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
 
బీజేపీకి జిల్లాను ఆయువుపట్టు చేస్తాం
అమిత్‌షా హైదరాబాద్ సభ ముగిసిన వెంటనే జిల్లాలో బహిరంగ సభను ప్రకటించడం, అందుకు రాష్ట్ర పార్టీ అనుమతి ఇవ్వడం మంచి పరిణామమే. జిల్లాలో బీజేపీకి ఉన్న బలం ఈ బహిరంగ సభతో రెట్టింపవుతుంది. అమిత్‌షా ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళతాం. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి తెలంగాణలో బీజేపీకి నల్లగొండ ఆయువుపట్టు అని నిరూపిస్తాం.
- వీరెల్లి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు