‘ఎత్తిపోతల’ విద్యుత్ అవసరాలు రెట్టింపు!

7 Dec, 2014 23:57 IST|Sakshi
‘ఎత్తిపోతల’ విద్యుత్ అవసరాలు రెట్టింపు!

వచ్చే ఏడాదికి 3,728
మిలియన్ యూనిట్లు అవసరం
టాస్క్‌ఫోర్స్ కమిటీ అంచనా
ప్రధాన ప్రాజెక్టులన్నీ 2015లో వినియోగంలోకి వచ్చే అవకాశం  

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణ ప్రాంతమంతా పీఠభూమి అయినందున ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతలవే కావడం, రానున్న ఏడాదిలో ఇందులో మెజార్టీ ప్రాజెక్టుల పనులు ముగింపు దశకు చేరనున్న దృష్ట్యా విద్యుత్ అవసరాలు దాదాపు రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయి.
 
 రాష్ట్రంలో రానున్న ఐదేళ్ల విద్యుత్ అవసరాలపై ఇంధన శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వచ్చే ఏడాదికి 2,505 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరాలు పెరిగి, మొత్తంగా 3,728 మిలియన్ యూనిట్లకు చేరుతుందని టాస్క్‌ఫోర్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో పనులు ముగింపు దశలో ఉన్న ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యమిచ్చి వాటి సత్వర పూర్తి, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసిన విషయం తెలిసిందే.
 
  ప్రభుత్వం అంచనా వేసిన మేరకు వచ్చే ఏడాది పూర్తయ్యే ప్రాజెక్టుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నె ట్టెంపాడు, భీమా ఎత్తిపోతలతో పాటు నీల్వాయి, పెద్దవాగు, మత్తడివాగు, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టులు సహా మరికొన్ని మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టు లక్ష్యాలు చేరుకోకున్నా సగానికైనా నీరందించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. భీమా ప్రాజెక్టు పరిధిలో వాస్తవ ఆయకట్టు లక్ష్యం 2లక్షల ఎకరాలు కాగా ఇందులో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 91వేల ఎకరాలు, అలానే కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో మొత్తం లక్ష్యం 3.40 లక్షలు కాగా ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 80 వేల ఎకరాల లక్ష్యాన్ని నిర్ధారించారు. ఇలా మిగతా ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 6.17లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సాగునీటి అవసరాలు తీరుస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, ఏఎంఆర్పీ వంటి ప్రాజెక్టులతో పాటు 784 చిన్నపాటి ఎత్తిపోతల పథకాల కింద ప్రస్తుత ఏడాది విద్యుత్ అవసరాలు 1,223 మిలియన్ యూనిట్లుగా ఉంది.
 
 2015-16 ఆర్థిక సంవత్సరంలో మెజార్టీ ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున విద్యుత్ అవసరాలు 3,728 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ కమిటీ అంచనా వేసింది. 2016-17 విద్యుత్ అవసరాల్లో ఎలాంటి మార్పులు సూచించని కమిటీ.. 2017-18లో మాత్రం 7,392 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని పేర్కొంది. ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రధాన ప్రాజెక్టుల  తొలిదశ పనులు పూర్తి కావడం, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఈ అవసరాలు 2015-16 నుంచి 2017-18 నాటికి అదనంగా 3,664 మిలియన్ యూనిట్లకు పెరగవచ్చని కమిటీ అంచనా వేసింది.

మరిన్ని వార్తలు