మరో 2 వేల విద్యుత్‌ కొలువులు

19 Oct, 2019 03:07 IST|Sakshi

ఇప్పటి వరకు 12,171 విద్యుత్‌ ఉద్యోగాల భర్తీ 

22,637 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విలీనం

ఉద్యోగాల కల్పనలో విద్యుత్‌శాఖ అగ్రస్థానం

ట్రాన్స్‌కో యాజమాన్యం ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ శాఖ త్వరలో మరో 2 వేల పోస్టులను భర్తీ చేయనుందని తెలంగాణ ట్రాన్స్‌కో తెలిపింది. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు కలిపి మొత్తం 12,171 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేశాయని, మరో 22,637 మంది విద్యుత్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నాయని పేర్కొంది.

కొత్త నియామకాలతో పాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రూపంలో గత ఐదేళ్లలో మొత్తం 34,808 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అత్యధిక మందికి ఉద్యోగాలిచ్చిన విభాగంగా విద్యుత్‌ శాఖ రికార్డు సృష్టించిందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే విద్యుత్‌ సంస్థల ఆదాయంలో 9 శాతం ఉద్యోగుల వేతనాలకు వెచ్చిస్తున్నామని, వేతనాల చెల్లింపులో తెలంగాణ విద్యుత్‌ శాఖ దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని పేర్కొంది. మిగతా రాష్ట్రాల్లో 5 నుంచి 7 శాతం వరకే జీతభత్యాలకు చెల్లిస్తున్నారని తెలిపింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 1,17,177 మందికి ఉద్యోగావకాశం లభించిందని ట్రాన్స్‌కో తెలిపింది.

విద్యుత్‌ శాఖలోనే ఎక్కువ నియామకాలు జరగడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ ఫలితమే. ప్రైవేటులో కాకుండా జెన్‌ కో ద్వారానే విద్యుత్‌ ఉత్పత్తి జరగాలని ఆయన నిర్ణయించారు. దీంతో ఉత్పత్తి ప్లాంట్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాం.ఉద్యోగ భద్రత లేకుండా, ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన 22,637 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను సంస్థలో విలీనం చేసుకోవాలనే మానవతా నిర్ణయం కూడా సీఎందే. వారి ఆర్టిజన్ల సర్వీసు నిబంధనల (స్టాండింగ్‌ ఆర్డర్ల)ను కూడా హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం. పెద్ద ఎత్తున నియామకాలు జరపడమే కాకుండా, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. 
ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా