మూగబోయిన కళాకారుడి గొంతు

17 Jul, 2014 05:13 IST|Sakshi
మూగబోయిన కళాకారుడి గొంతు
  •    విద్యుదాఘాతంతో గాయకుడు రాజు మృతి
  •      పెళ్లయిన 26 రోజులకే విషాదం
  •      శోకసంద్రంలో షాపల్లి గ్రామం
  • జఫర్‌గఢ్ : తెలంగాణ ఉద్యమానికి తన ఆటాపాట ద్వారా వెన్నుదన్నుగా నిలిచి ప్రజలను ఉత్తేజపర్చిన ఓ కళాకారుడి గొంతు మూగబోయింది. పెళ్లయిన 26 రోజులకే కరెంట్ రూపంలో మృత్యువు అతడిని బలిగొంది. ఈ ఘటనతో మండలంలోని షాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధి త కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన యాతం వెంకటయ్య, రామతార దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

    గాయకుడైన వారి పెద్ద కుమారుడు రాజు(24) మూడేళ్లుగా తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇస్తూ తన ఆటపాటల ద్వారా ప్రజలను ఎంతో చెతన్యపర్చాడు. ప్రముఖ కళాకారులు గిద్దె రాంనర్సయ్య, గొలుసుల రంజిత్, మహంకాళి యాకుబ్, దార దేవేందర్ కళాబృందాల్లో చురుకుగా పాల్గొంటూ పలు ధూంధాం కార్యక్రమాల్లో  పాల్గొన్నాడు.

    తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన రాజు కళాకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఒకవైపు కళాకారుడిగా రాణిస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తూ తన కుటుంబానికి అండగా నిలిచాడు. గత ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేష్‌తోపాటు పెద్ది సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించాడు. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన రాజుకు 26 రోజుల క్రితమే వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి రాజు ఇంట్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు.
     
    రోజులాగే వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన అతడు నాట్లు వేసేందుకు పొలం గట్టుకు వరాలు వేస్తుండగా అనుకోకుండా తన వ్యవసాయ బోర్‌కు సంబంధించిన మోటార్ పైపునకు చేయి తగిలింది. అప్పటికే ఆ పైపునకు విద్యుత్ సరఫరా అవుతుండడంతో విద్యుదాఘాతానికి గురై పొలంలోనే పడిపోయూడు. పెద్దపెట్టున కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల రైతులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి రాజు మృతిచెందాడు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామస్తులు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని రాజు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.  
     
    పెళ్లయిన 26  రోజులకే అనంతలోకాలకు..
     
    పెళ్లయిన 26 రోజులకే రాజు మృతిచెందడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయూరుు. రాజు మృతితో అతడి భార్య రోదించిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
     
    తెలంగాణ ఉద్యమం సాగుతు న్న సమయంలో తన ఆట పాట ద్వారా ప్రజలను ఎంతో చైతన్యపర్చారని, అలాంటి వ్యక్తి తమ మధ్యలో లేకపోవడం పట్ల ఎంతో బాధగా ఉందని అతడి స్మేహితులు,  స్థానికులు కన్నీరుపెట్టారు. పేద కుటుంబానికి చెందిన కళాకారుడు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు వారు కోరారు. ఈ ఘటన తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
     

మరిన్ని వార్తలు