కాళేశ్వరానికి మెగా పవర్‌

19 Mar, 2018 01:29 IST|Sakshi

ఏప్రిల్‌ నెలాఖరుకే విద్యుత్‌ అందించేలా ఏర్పాట్లు

యుద్ధ ప్రాతిపదికన సబ్‌స్టేషన్లు, ప్రత్యేక లైన్ల పనులు 

ప్రాజెక్టుకు అవసరమైన 4,627 మెగావాట్ల విద్యుత్‌కు ప్రణాళిక 

మేడిగడ్డ–సుందిళ్ల’కే 1,120 ఎంవీలు.. ఇందుకు రూ.486 కోట్లతో పనులు  

ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి.. జైపూర్‌ ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ సరఫరా

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే వానాకాల సీజన్‌కు నీరందించే లక్ష్యంతో సిద్ధం చేస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి విద్యుత్‌ సరఫరా పనులు ఊపందుకున్నాయి. ఏప్రిల్‌ నెలాఖరుకు విద్యుత్‌ అందించేలా సబ్‌స్టేషన్ల నిర్మాణం, ప్రత్యేక లైన్ల ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రాజెక్టుకు మొత్తంగా 4,627 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉండగా.. ఇందులో మేడిగడ్డ నుంచి సుందిళ్ల పంప్‌ హౌజ్‌కు నీరు తరలించడానికి 1,120 మెగావాట్ల అవసరమవనుంది. ఈ విద్యుత్‌ను మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి పవర్‌ప్లాంట్‌ ద్వారా అందించేందుకు రూ.486 కోట్లతో పనులు చేపట్టారు.  

అన్ని పనులూ సమాంతరంగా.. 
కాళేశ్వరం ద్వారా ఖరీఫ్‌ నాటికి కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 టీఎంసీల నీరు ఎత్తిపోసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో 5.81 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకు గాను 4.50 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తయ్యాయి. 80 శాతం సిమెంట్, కాంక్రీటు పనులూ పూర్తయ్యాయి. అన్నారం బ్యారేజీకి 66, మేడిగడ్డకు 86, సుందిళ్లకు 74 గేట్లు అమర్చాల్సి ఉండగా శనివారం అన్నారం బ్యారేజీకి తొలి గేటు బిగించారు. జూన్‌ చివరి నాటికి మిగిలిన పనులు పూర్తి చేసేలా వేగం పెంచారు. పంప్‌హౌజ్‌లకు అవసరమైన యం త్రాల రవాణా జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలైంది. మరో 10 రోజుల్లో ఇవి దిగుమతి కానున్నాయి. వీటిని అమర్చేలోగా మోటార్ల డ్రై రన్, ట్రయల్‌ రన్‌ల నిర్వహణకు వీలుగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సిద్ధం చేయాలి. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.

మేడిగడ్డ–సుందిళ్లకు తొలి ప్రాధాన్యం 
కాళేశ్వరం ఎత్తిపోతలకు మొత్తంగా 4,627 మెగావాట్ల విద్యుత్‌ అవసరముంది. ఇందులో మేడిగడ్డ బ్యారేజీ నుంచి సుందిళ్ల పంప్‌ హౌజ్‌ల పరిధిలోనే 1,120 మెగావాట్లు అవసరం. ఈ నేపథ్యంలో తొలి లింక్‌గా ఉన్న మేడిగడ్డ–సుందిళ్ల మధ్య విద్యుత్‌ సరఫరాకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి పంప్‌ హౌజ్‌ వరకు 80 కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైన్ల ఏర్పాటు జరుగుతోంది. పంప్‌ హౌజ్‌లో 40 మెగావాట్ల సామర్థ్యంతో 11 మోటార్లకు 440 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంది. ఇందుకుగాను 220/11 కె.వి. సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు 80 శాతం, విద్యుత్‌ లైన్‌ పనులు 40 శాతం పూర్తయ్యాయి. రూ.180.56 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్నాయి. అన్నారం పంప్‌ హౌజ్‌కు 40 మెగావాట్ల సామర్థ్యమున్న 8 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 320 మెగావాట్ల విద్యుత్‌ అవసరముంది. ఇక్కడ 220/11 కె.వి. సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు 80 శాతం, విద్యుత్‌ లైను పనులు 45 శాతం పూర్తయ్యాయి. ఈ పనులను రూ. 99.48 కోట్లతో చేపట్టారు. సుందిళ్ల పంప్‌ హౌజ్‌ కోసం జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి 6 కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైను పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 40 మెగావాట్ల సామర్థ్యంతో 9 మోటార్లకు గాను 360 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంది. ఇందుకు 220/11 కె.వి. సబ్‌స్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది. రూ. 205.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు 60 శాతం పూర్తయ్యాయి.

అంతరాయం లేకుండా.. 
వచ్చే నెలాఖరుకు విద్యుత్‌ సరఫరా వ్యవస్థను సిద్ధం చేసేలా ట్రాన్స్‌కో పనులు చేస్తోంది. ఎత్తిపోతల ప్రాజెక్టులకు అంతరాయం లేకుండా ఒకే కేంద్రం నుంచి కాకుండా వేర్వేరు జనరేషన్‌ స్టేషన్ల ద్వారా విద్యుత్‌ అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంతో దక్షిణాది రాష్ట్రాలతో విద్యుత్‌ గ్రిడ్‌ అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి విద్యుత్‌ గ్రిడ్‌ అనుసంధానం పూర్తయ్యే దృష్ట్యా ప్రాజెక్టు విద్యుత్‌ సరఫరాకు ఢోకా ఉండదని ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది.

మరిన్ని వార్తలు