ఆపరేషన్‌ విద్యుత్‌!

4 Mar, 2019 11:13 IST|Sakshi

ముదురుతున్న ఎండలు, ఉక్కపోత

గ్రేటర్‌లో పెరగనున్న విద్యుత్‌ వినియోగం

రోజుకో ఎంయూ చొప్పున పెరిగే చాన్స్‌  

వేసవిలో 65 ఎంయూలు దాటే అవకాశం

రూ.228 కోట్లతో పునరుద్ధరణ పనులు

అదనపు ఏర్పాట్లలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ  

సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది ఎండలు ఫిబ్రవరి రెండోవారం నుంచే మండు వేసవిని తలపించాయి. మార్చి, ఏప్రిల్‌ నెలలో మరింత ముదిరే అవకాశం ఉంది. ఎండల వేడి, ఉక్కపోతను తట్టుకునేందుకు సిటీజన్లు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో విద్యుత్‌ కూడా అధికంగా పెరగడం ఖాయం. వేసవిలో రోజురోజుకూ పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ గ్రేటర్‌లోని సబ్‌స్టేషన్లు, ఫీడర్లపై భారం పడకుండా ఉండేందుకు శివారు ప్రాంతాల్లోని విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల పునరుద్ధరణపై దృష్టి సారించింది. ఔటర్‌కు రెండు వైపులా బహుళ అంతస్తుల నిర్మాణాలు ఊపందుకోవడం, కొత్త వాణిజ్య సంస్థలు వెలుస్తుండటంతో గ్రేటర్‌ పరిధి శరవేగంగా విస్తరిస్తోంది.

కోర్‌ సిటీలోని సబ్‌స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించేందుకు శివార్లలోని సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ముందస్తుగా ఆయా ప్రాంతాల్లోని లైన్లను ఆధునికీకరించాలని భావించింది. ఇందుకోసం ట్రాన్స్‌మిషన్‌డిష్ట్రిబ్యూషన్‌ స్కీం నిధుల నుంచి రూ.228 కోట్లతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా 12 సబ్‌స్టేషన్లు (33/11కేవీ), 62 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 188 కిలో మీటర్ల 11 కేవీ లైన్లు, 29 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీని పెంచాలని విద్యుత్‌శాఖ అధికారులు నిర్ణయించి ఆయా ప్రాంతాల్లో పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జరుగుతుండటం, త్వరలోనే టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూనే మరోవైపు ఈ పనులు పూర్తి చేస్తుండటం గమనార్హం.  

రోజుకో ‘ఎంయూ’ చొప్పున పైపైకి..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తొమ్మిది విద్యుత్‌ సర్కిళ్లు, 22 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 54.10 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 44.60 లక్షల గృహ, 6.95 వాణిజ్య, 41,807 పారిశ్రామిక, 7,321 హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రేటర్‌ ప్రజల సగటు విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ధనవంతుల నివాసాల్లో మాత్రమే కనిపించే ఏసీలు, రిఫిజ్రిరేటర్లు, కంప్యూటర్లు, వాషింగ్‌ మిషన్లు, హీటర్లు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారం వరకు చలి ఉండటం వల్ల ఏసీ, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం పెద్దగా లేదు. తర్వాత పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో పాటు ఉక్కపోత వల్ల ఫ్యాన్లు, ఏసీల వాడకం కూడా పెరిగి.. ఆమేరకు విద్యుత్‌ వినియోగం రెట్టింపయింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు రోజువారి సగటు విద్యుత్‌ వినియోగం 42 మిలియన్‌ యూనిట్‌(ఎంయూ) దాటలేదు. తర్వాత వాతావరణంలో మార్పుల వల్ల రోజుకో మిలియన్‌ యూనిట్‌ చొప్పున ప్రస్తుతం రోజువారి సగటు విద్యుత్‌ వినియోగం 55 మిలియన్‌ యూనిట్లకు చేరుకోవడం గమనార్హం.

68 ఎంయూలకు చేరవచ్చు  
గతేడాది మే 30న మధ్యాహ్నం 3.42 గంటలకు గ్రేటర్‌లో అత్యధికంగా 62.83 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదైంది. దాంతో పోలిస్తే ప్రస్తుతం వినియోగంతో పాటు కొత్త కనెక్షన్ల సంఖ్య 20 శాతం పెరిగాయి. త్వరలో ఈ వినియోగం 65 నుంచి 68 ఎంయూలకు చేరుతదుందని అంచనా. ఇప్పటికే గ్రేటర్‌లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేశాం. వార్షిక పరీక్షల సీజన్‌ కావడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఓ వైపు పునరుద్ధరణ పనులు చేపడుతూనే.. మరోవైపు అంతరాయాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం.     – శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్‌ 

మరిన్ని వార్తలు