50 ఏళ్లుగా వెలుగులు పంచుతూ.. 

11 Jan, 2019 02:00 IST|Sakshi

విద్యుత్‌ రంగంలో స్వర్ణోత్సవం పూర్తిచేసుకున్న ప్రభాకర్‌

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా విశేష సేవలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు గురువారంతో విద్యుత్‌ శాఖలో 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. 1969 జనవరి 10న ఆయన అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్‌ఈబీ)లో ఉద్యోగప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో కీలక హోదాల్లో సేవలందించారు. విద్యుత్‌ రంగంలో ఆయన  సేవలు, విశేషానుభవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రంలో.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్‌ అధికారులు కాదని ఈ పదవిని ఏరికోరి ప్రభాకర్‌ రావుకు కట్టబెట్టారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కొరతను అధిగమించి 24 గంటల విద్యుత్‌ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయానికి తొలుత 9 గంటల నిరంతర విద్యుత్, ఆ తర్వాత 24 గంటల విద్యుత్‌ సరఫరా వంటి కేసీఆర్‌ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయడంలో సఫలమయ్యారు.

రాష్ట్రంలో కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, విద్యుత్‌ సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు మొత్తం విద్యుత్‌ శాఖను పరుగులు పెట్టించారు. రికార్డు సమయంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు, సబ్‌–స్టేషన్లు, లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పీజీసీఎల్‌ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రశంసలు అందుకున్నారు. విద్యుత్‌ రంగంలో చేసిన విశేష కృషికి గానూ.. గతేడాది ఎకనమిక్‌ టైమ్స్, సీబీఐపీ, స్కోచ్‌ పురస్కారాలను అందుకున్నారు. 2017లో బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు ఫర్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో, విద్యుత్‌ రంగంలో విశేష కృషికి గానూ 2016లో బూర్గుల రామకృష్ణారావు పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ పవర్‌ యుటిలిటీస్‌ 2013లో ఆయనకు ఇండియా పవర్‌ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా విద్యుత్‌ ఇంజనీర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ కేక్‌ను ఆయనతో కట్‌ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొని ఆయన్ను అభినందించారు. 

మరిన్ని వార్తలు