బకాయి చెల్లించకుండా బుకాయింపు 

9 Mar, 2019 01:44 IST|Sakshi

ఏపీ అధికారులపై తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ మండిపాటు 

వాస్తవాలు పక్కన పెట్టి ఏపీ తప్పుడు లెక్కలు వినిపిస్తోంది 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రూ.5 వేల కోట్లకుపైగా బకాయి పడ్డాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఏపీ విద్యుత్తు సంస్థలే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని పక్కనపెట్టి ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే’తరహాలో ఏపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విద్యుత్‌సౌధలో మీడియాతో మాట్లాడారు. రెండు వైపుల నుంచి బకాయిలు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నందున చాలాకాలంగా పరిష్కారం కోసం ఆహ్వానిస్తున్నా ఏపీ అధికారులు సహకరించటం లేదన్నారు. సెటిల్‌మెంట్‌ కోసం ముందుకు రాకుండా ఇప్పుడేమో తెలంగాణ విద్యుత్తు సంస్థలే బకాయి పడ్డాయని ఆరోపించటం హాస్యాస్పదమన్నారు.

‘ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ డిస్కంలకు రూ.1,659 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.101 కోట్లు, ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ జెన్‌కోకు రూ.3,096 కోట్లు, ఏపీ పవర్‌ యుటిలిటీస్‌ నుంచి తెలంగాణ పవర్‌ యుటిలిటీస్‌కు రూ.929 కోట్లు వెరసి రూ.5,785 కోట్లు రావాల్సి ఉంది. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రూ.3,379 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం పోను ఏపీ సంస్థలు తెలంగాణ సంస్థలకు రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్ల వరకు తెలంగాణకు ఏపీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటిని మరుగున పడేసి తెలంగాణనే బకాయిపడ్డట్టు తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఈ లెక్కలు బహుశా అక్కడి ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయలోపం ఉన్నట్టుంది. తెలిసి ఉంటే ప్రభుత్వ వాదన అలా ఉండదు కదా’అని ప్రభాకరరావు అన్నారు.

ఎన్‌సీఎల్‌టీని ఎందుకు ఆశ్రయించినట్టో... 
వాస్తవాలను పక్కన పెట్టి ఏపీ జెన్‌కో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించటం విడ్డూరంగా మారిందని ప్రభాకర్‌రావు అన్నారు. దివాలా తీసిన సమయంలో ఈ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి లెక్కలు సరిచేసుకునేందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిర్వహిస్తారని, మరి తెలంగాణ విద్యుత్తు సంస్థలను ఏపీ స్వాధీనం చేసుకోవాలని చూస్తోందా... అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ బకాయిలకు సంబంధించి సెటిల్‌ చేసుకునేందుకు రావాలంటూ ఇప్పటికే ఏడెనిమిది లేఖలు రాశామని, తాను స్వయంగా ఏపీ అధికారులతో మాట్లాడానని, కానీ అక్కడి నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఏపీ అధికారులు ముందుకొస్తే 24 గంటల్లో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని, ఆ తర్వాత తాము చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు కూడా సిద్ధమన్నారు. ఏపీ తెలంగాణకు చెల్లించేది డబ్బు... తెలంగాణ ఏపీకి చెల్లించాల్సింది డబ్బు కాదా... డబ్బుకు కూడా రంగు, రుచి, వాసన వేర్వేరుగా ఉంటాయని ఏపీ అధికారులు భావిస్తున్నట్టున్నారంటూ ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు