టీ జెన్‌కో సీఎండీగా ప్రభాకర్‌రావు?

23 May, 2014 00:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా దేవులపల్లి ప్రభాకర్‌రావు నియమితులుకానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీఆర్‌ఎస్ ఉన్నతస్థాయి వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొన్నటివరకు ఆయన జెన్‌కో జేఎండీగా వ్యవహరించారు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడంలో, ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. విద్యుత్‌రంగాన్ని పటిష్టపరిచే విషయంలో చంద్రబాబుతో భేదాభిప్రాయాలు తలెత్తితే  తన పదవికే రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధపడ్డారు. సంస్థను పటిష్టపరచడంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న ప్రభాకర్‌రావు... సకాలంలో ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారనే అభిప్రాయం ఇంధనశాఖలో ఉంది.

 

ఈ నేపథ్యంలో విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తుతుందనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఇటువంటి అనుభవజ్ఞుడిని జెన్‌కో సీఎండీగా చేయడం వల్ల త్వరగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. సుదీర్ఘకాలం ఫైనాన్స్ డెరైక్టర్‌గా పనిచేయడం వల్ల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)తో పాటు బ్యాంకర్లతో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. అందువల్ల ప్రభాకర్‌రావు నియామకం వల్ల విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తదనే అభిప్రాయమూ ఉంది. విద్యుత్ బోర్డు విభజనకు ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డులో ఫైనాన్స్ మెంబర్‌గా పనిచేశారు. అలాగే ట్రాన్స్‌కో, జెన్‌కోలలో ఫైనాన్స్ డెరైక్టర్‌గా పనిచేశారు. జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో ముఖ్యభూమిక పోషించారు.

 

మరిన్ని వార్తలు