‘మెదక్‌’ తీర్పు దేశంలో చర్చకు దారితీయాలి 

8 Apr, 2019 04:56 IST|Sakshi

ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: హరీశ్‌రావు

గజ్వేల్‌: మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల తీర్పు దేశ ప్రజలంతా ఆసక్తికరంగా చర్చించుకునే విధంగా ఉండాలని.. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న అమేథి నియోజకవర్గాల కంటే అత్యధిక మెజారిటీని టీఆర్‌ఎస్‌కు ఇవ్వాలని మాజీమంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్‌లోని లక్ష్మీగార్డెన్స్‌లో నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి హాజరయ్యారు. హరీశ్‌ మాట్లాడుతూ ప్రధాని, ప్రతిపక్ష నేతల వారణాసి, అమేథీ నియోజకవర్గాల్లో ప్రజలకు కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని చెప్పారు. సౌకర్యాల పరంగా ముందంజలో ఉన్న సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి 1.50 లక్షల మెజారిటీని ఇవ్వగలిగితే.. మిగతా ఆరు నియోజకవర్గాల నుంచి లక్ష చొప్పున మెజార్టీ వచ్చే అవకాశముంటుందన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు 5 లక్షల పైచిలుకు మెజార్టీతో రికార్డు స్థాయి విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ప్రీతమ్‌ముండే, పీవీ నర్సింహారావు, ప్రధాని నరేంద్రమోదీల సరసన కొత్త ప్రభాకర్‌రెడ్డిని చేర్చే విధంగా కృషి చేయాలని హరీశ్‌ వ్యాఖ్యానించారు.   కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి చేరికతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రెండోసారి ఎంపీగా అవకాశం కల్పించాలని, సీఎం కేసీఆర్, హరీశ్‌ల సహకారంతో మెదక్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను మాజీ మంత్రి హరీశ్‌పై చేసినవన్నీ రాజకీయ విమర్శలేనని, వ్యక్తిగతమైన ద్వేషాలు లేవని టీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండుసార్లు తనను గజ్వేల్‌ నియోజకవర్గంలో ఓడించడానికి హరీశ్‌ కంకణం కట్టుకోవడం వల్లే కసితో ఆరోపణలు, విమర్శలు గుప్పించానని అన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు