ప్రభాస్‌ పిటిషన్‌పై నేడు విచారణ

21 Dec, 2018 01:27 IST|Sakshi

అత్యవసర విచారణ అవసరం ఉందన్న ప్రభాస్‌ న్యాయవాది 

సానుకూలంగా  స్పందించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్‌ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ సినీనటుడు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ప్రభాస్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ఆయన బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ విచారణ ప్రారంభించగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.శరత్‌కుమార్‌ స్పందిస్తూ.. ప్రభాస్‌ స్థల వివాదం సివిల్‌ సూట్‌ 7, 14లకు సంబంధించిందని, దీనిపై మరో ధర్మాసనం విచారణ జరుపుతోందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి తన ముందున్న ప్రభాస్‌ పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు.  గురువారం నాటి విచారణ జాబితాలో ఈ కేసు లేకపోవడంతో జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రభాస్‌  న్యాయవాది తమ పిటిషన్‌పై ప్రస్తావించారు. 

మరిన్ని వార్తలు