కొత్త పీఆర్సీ..!

22 Jul, 2017 04:03 IST|Sakshi
కొత్త పీఆర్సీ..!

రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

మాజీ సీఎస్‌ ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో కమిషన్‌
ఆరు నెలల్లో నివేదిక.. 2018 జూలై ఒకటి నుంచి అమలు
పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచే ప్రతిపాదన
పీఆర్సీపై వచ్చే నెల తొలివారంలో ప్రత్యేక సమావేశం
2015లో ఇచ్చిన ఫిట్‌మెంట్‌ ఉమ్మడి రాష్ట్రంలోని పీఆర్సీదే
 

సాక్షి, హైదరాబాద్‌ :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ కమిషన్‌) ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. వచ్చే నెల తొలి వారంలోనే కమిషన్‌ను నియమించాలని.. వచ్చే ఏడాది జూలై నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపును అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదననూ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆగస్టు మొదటి వారంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి.

ఆ ఫిట్‌మెంట్‌ పాత పీఆర్సీదే..
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో ప్రభుత్వం ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించినా..అది ఉమ్మడి రాష్ట్రంలో వీకే అగర్వాల్‌ చైర్మన్‌గా ఉన్న పదో పీఆర్సీ అమలు సమయానికి సంబంధించినదే. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేయనున్న వేతన సవరణ సంఘం రాష్ట్రంలో మొదటి పీఆర్సీ కానుంది. 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదో పీఆర్సీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. ఆ పీఆర్సీ అమలు సమయం మేరకు 2013 జూలై ఒకటో తేదీ నుంచే వర్తింపజేసింది. రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉన్న కాలాన్ని నోషనల్‌గా పరిగణించి.. ఆవిర్భావం నాటి నుంచి నగదు రూపంలో పీఆర్సీ బకాయిలను చెల్లిస్తోంది.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ప్రదీప్‌చంద్ర ఆధ్వర్యంలో..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే రిటైరైన సీనియర్‌ ఐఏఎస్‌ ప్రదీప్‌చంద్రను పీఆర్సీ చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పదో పీఆర్సీ అమలు సమయంలో, తెలంగాణ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ రూపకల్పనలోనూ ప్రదీప్‌చంద్ర కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వేతన సంబంధిత వ్యవహారాల్లో ప్రదీప్‌చంద్రకు అనుభవాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐదేళ్లకోసారి..
ఉమ్మడి రాష్ట్రంలో 1998 జూలై నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నారు. దాని ప్రకారం పదో పీఆర్సీ కాల పరిమితి 2018 జూలై ఒకటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ తేదీ కంటే ఏడాది ముందుగానే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిషన్‌ దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలపై ఉద్యోగుల అభిప్రాయాలను, ప్రతిపాదనలను స్వీకరిస్తుంది. వాటన్నింటినీ అధ్యయనం చేసి సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. ఇక ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ నివేదికను పరిశీలించి.. ఏయే ప్రతిపాదనలను ఆమోదించాలి, వేటిని పక్కనబెట్టాలి, ఏయే ప్రతిపాదనలను సవరించాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే మొత్తంగా 2018 జూలై నుంచి ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తున్నాయి.

పదవీ విరమణ వయసు పెంపు!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలన్న ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఆ రాష్ట్ర ప్రభుత్వం 58 ఏళ్ల నుంచి నుంచి 60 ఏళ్లకు పెంచింది. అప్పటి నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణలోనూ అమలు చేయాలని సర్కారుపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటుతో పాటు పదవీ విరమణ అంశాన్ని సైతం ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలనకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు