లెక్క తేలింది.. 

22 Feb, 2019 08:07 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సర్వే పూర్తయ్యింది.. దీంతో ఈ పథకానికి అర్హుల లెక్క తేలింది. జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన 45,042 కుటుంబాలు ఉండగా, ఇందులో 41,439 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. సర్వే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. కాగా మొదటి విడతగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున ఈ నెల 24న డబ్బులు జమ కానున్నాయి. జిల్లాలో మొత్తం 1,33,447 మంది రైతులు ఉండగా, కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి నిబంధన ఉండడంతో సగానికంటే ఎక్కువ మంది రైతులు పథకానికి దూరమయ్యారు. ఈ నెల 14న ప్రారంభమైన సర్వే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఏఈఓలు సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నారు. ఇప్పటివరకు 32,763 మంది రైతుల వివరాలను అప్‌లోడ్‌   చేశారు. మిగతా వారి వివరాలు సైతం మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు

రైతుల ఖాతాల్లో డబ్బులు..
సమ్మాన్‌ పథకంలో భాగంగా అర్హులైన రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో ఈనెల 24 నుంచి డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా అకౌంట్లలో వేయనున్నారు. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున అందించనున్నారు. అయితే జిల్లాలోని 18 మండలాల్లో 5 ఎకరాలు కలిగి ఉన్న రైతులు 45,042 రైతు కుటుంబాలు ఉండగా, ఇందులో 194 మంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, లాయర్లు, డాక్టర్లు, ఐటీ చెల్లించేవారు, తదితరులు ఉండడంతో అనర్హులుగా గుర్తించారు. ఈ పథకానికి సంబంధించి 41,439 మంది రైతులను అధికారులు అర్హులుగా గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు 32,763 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. 3,374 మంది రైతుల బ్యాంక్‌ ఖాతాలు సేకరించాల్సి ఉందని, 676 మంది రైతుల పూర్తి వివరాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు.

రైతుల వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నాం
జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలు 45,042 ఉండగా, ఇప్పటివరకు 41,414 మంది రైతులను అర్హులుగా గుర్తించాం. 194 మంది రైతులను ఈ పథకానికి అనర్హులుగా గుర్తించాం. 676 మంది రైతుల వివరాలు పూర్తిగా లేవు. 3,374 మంది రైతుల బ్యాంక్‌ ఖాతాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 33,763 రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాం. ఇంకా 95 గ్రామాల రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు