‘ప్రగతి’ సభకు వెళ్లి పరలోకానికి

4 Sep, 2018 08:38 IST|Sakshi
జాంగీర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న నాగం జనార్దన్‌రెడ్డి, జాంగీర్‌ (ఫైల్‌)

తెలకపల్లి (నాగర్‌కర్నూల్‌): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన ఎండీ జాంగీర్‌(45) టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొంగరకలాన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు శనివారం సాయంత్రం ట్రాక్టర్లలో బయల్దేరారు. రాత్రి మైసిగండిలో బస చేసి ఆదివారం ఉదయం మరో వాహనంలో కొంగరకలాన్‌కు వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణంలో మైసిగండిలో తాము ఉంచిన ట్రాక్టర్ల వద్ద చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మైసిగండి వద్ద రోడ్డు దాటుతుండగా దేవరకొండ ప్రాంతంలోని మల్లెపల్లికి చెందిన క్రూయిజర్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఎండీ జాంగీర్,  మండలి బాలపీరు గౌస్‌పాష తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మైసిగండిలో ఉన్న పోలీసులు క్షతగాత్రులను ఆమన్‌గల్‌ ఆస్పత్రికి తరలించారు. ఇందులో జాంగీర్, బాలపీరు పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మార్గమధ్యలో జాంగీర్‌ మృతిచెందాడు. బాలపీరుకు కాలు విరిగి తీవ్ర గాయం కావడంతో అక్కడే చికిత్స పొందుతున్నాడు. జాంగీర్‌కు భార్య రజియాబేగం, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో జాంగీర్‌ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు గ్రామస్తులు ఆస్పత్రికి వెళ్లారు. కల్వకుర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో గౌరారంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

ఆర్థికసాయం అందజేత.. 
నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డిలు సోమవారం నిమ్స్‌ ఆస్పత్రిలో గాయపడిన బాలపీరును పరామర్శించారు. జాంగీర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే నాగం జనార్దన్‌రెడ్డి జాంగీర్‌ కుటుంబానికి రూ.20 వేలు, బాలపీరు కుటుంబ సభ్యులకు రూ.10 వేలు అందజేశారు. గౌస్‌పాష అనే వ్యక్తికి కూడా గాయాలు కావడంతో నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి వెళ్లారు. జాంగీర్‌ కుటుంబ సభ్యులను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు పరామర్శించారు.

మరిన్ని వార్తలు