ఆవేదనల నివేదనలు

29 May, 2018 07:18 IST|Sakshi
వినతులు స్వీకరిస్తున్న జేసీ బద్రి శ్రీనివాస్‌

ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు 

ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలి

జాయింట్‌ కలెక్టర్‌ బద్రి శ్రీనివాస్‌

కరీంనగర్‌సిటీ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలు మూలలా నుంచి బాధితులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించి న ప్రజావాణికి తరలివచ్చారు. ఎండను సైతం లెక్క చేయడం లేదు. ప్రధానంగా పట్టాపాసుపుస్తకాల్లో సవరణలు, భూ సమస్యలు, పింఛన్లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పన కోరుతూ అర్జీలు సమర్పించారు. జాయింట్‌ కలెక్టర్‌ బద్రి శ్రీనివాస్, ట్రెయినీ ఐఏఎస్‌ రాజశ్రీషార్‌ వినతులు స్వీకరించారు.

అంతకుముందు జిల్లా అధికారులతో కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ సమస్యలను ప్రతీ సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి ఫోన్‌ ద్వారా తెలుపుతారని, సంబంధిత జిల్లా అధికారులు వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ నుంచి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్‌ రుణం మంజూరు కోసం దరఖాస్తు చేశానని.. ఇంతవరకు మంజూరు కాలేదని తెలుపగా పరిశీలిస్తామని జేసీ అన్నారు.

రామడుగు మండలం తిరుమలాపూర్‌ నుంచి మల్లేశం మాట్లాడుతూ.. తన భూమి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని, కానీ నా ప్రత్యర్థికి పట్టాదారు పాసుపుస్తకం జారీ అయిందని తెలుపగా, వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. జమ్మికుంట మండలం బిజిగిరీషరీఫ్‌ నుంచి సదానందచారి మాట్లాడుతూ.. గ్రామానికి మానేరు నుంచి తాగునీటి పైప్‌లైన్‌ వేశారని.. ఇంతవరకు కనెక్షన్‌ ఇవ్వలేదని తెలుపగా గ్రామంలో ఆరు బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నామని తాగునీటికి కొదువ లేదని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.

చొప్పదండి మండలం రుక్మాపూర్‌ గ్రామం నుంచి మహేశ్‌ మాట్లాడుతూ జంగోలకుంట చెరువు నుంచి మట్టిని తీసి భూమిని కబ్జా చేసుకుంటున్నారని తెలపగా వెంటనే తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని తహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో అయేషా మస్రత్‌ ఖానమ్, జిల్లా పరిషత్‌ సీఈవో పద్మజారాణి, వయోజన విద్యాశాఖ డీడీ జయశంకర్, జౌళిశాఖ ఏడీ వెంకటేశం, మెప్మా పీడీ పవన్‌కుమార్, జిల్లా మార్కెటింగ్‌ శాఖ డీడీ పద్మావతి, సీపీవో పూర్ణచందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు