‘త్వరలో మమత ఇంటికే... ఆ తర్వాత కేసీఆరే’

17 Sep, 2019 19:59 IST|Sakshi

బీజేపీ బహిరంగ సభలో కేం‍ద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారులో మజ్లిస్‌ పార్టీ సవారీ చేస్తోందని.. కేసీఆర్‌ ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదని కేం‍ద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మండిపడ్డారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎస్‌వీఆర్ గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ విమోచన దినోత్సవ సభ’ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947 ఆగస్టు15 అనంతరం 13మాసాల తర్వాత హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. తెలంగాణలో మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వని దుస్థితి ఉందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోందన్నారు. త్వరలో మమత ఇంటికి వెళ్ళిపోతుంది. కేసీఆర్ కూడా ఇంటికి వెళతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో కుక్కలకు మర్యాద ఉంది. కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు విలువ లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏం పాలన నడుస్తుందో తెలియడం లేదన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా‍త్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదని.. ఆ పార్టీకి కనీసం అధ్యక్షుడు లేకపోవడం హాస్యస్పదం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నిధులు విడుదల చేసిందన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందని విమర్శించారు. హర్యానా, బిహార్ రాష్ట్రాలకు ఉన్న పూర్వ ముఖ్యమంత్రులకు పట్టిన గతి తెలంగాణ సీఎంకి కూడా పడుతుందన్నారు. ఈ క‍్రమంలో తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేశామని మంత్రి ప్రహ్లాద్‌ జోషి గుర్తు చేశారు.  ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.  ఈ బహిరంగ సభకు భారీగా బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా