ప్రాణహిత.. ఉరకలు

14 Jun, 2018 00:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గడ్చిరోలీలో వర్షాలతో దిగువకు భారీ వరద

ఒక్క రోజులో 36 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు ప్రవాహం పెరుగుదల 

‘మేడిగడ్డ’ పనులకు ఆటంకం, ఆగిన కాంక్రీట్‌ పనులు

ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. ఎగువ నీరంతా గోదావరి వైపు ఉరకలెత్తి వస్తోంది. ప్రాణహితకు 2.25 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం ఉండటం, అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. ఐదు రోజుల కిందట వరకు ప్రాణహిత నదికి 3 వేల క్యూసెక్కుల వరద కొనసాగగా, 3 రోజుల కిందట అది 7 వేలకు చేరింది. మంగళవారం కాళేశ్వరం వద్ద వరద 36 వేల క్యూసెక్కుల మేర నమోదు కాగా, బుధవారం ఒక్కసారిగా 80 వేల క్యూసెక్కులకు పెరిగింది. 2016లో ఇదే సమయానికి ఈ స్థాయి వరద రాగా, ప్రస్తుతం అంతకు మించి కొంత ఎక్కువ వరదే వస్తోంది. ప్రాణహిత నది నుంచి భారీగా ప్రవాహాలు వస్తుండటంతో మున్ముందు వరద పెరిగే అవకాశాలున్నాయి. 

మేడిగడ్డ బ్యారేజీ పనులపై ప్రభావం 
ప్రాణహిత వరద ప్రభావం మేడిగడ్డ బ్యారేజీ పనులపై పడింది. వరద ప్రవాహం వల్ల కాంక్రీట్‌ పనులు నిలిచిపోయాయి. మంగళ వారం ఇక్కడ 3,009 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు జరగ్గా, బుధవారం ఒక్క క్యూబిక్‌ మీటర్‌ పనికూడా జరగలేదు. ప్రాణ హిత గోదావరిలో కలవక ముందు ప్రాంతంలో నిర్మి స్తున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు యథావిధిగా కొనసాగాయి. బుధవారం అన్నారం పరిధిలో 2,315 క్యూ.మీ., సుందిళ్ల పరిధిలో 2,596 క్యూ.మీ. పనులు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో గోదావరి నది నుంచి మహారాష్ట్ర వైపునకు రాకపోకల కోసం రోడ్డు వేయగా, ప్రస్తుత వరదలతో పూర్తిగా కొట్టుకుపోయింది.

వరద నియంత్రణకు కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలని భావించగా, తెలంగాణ వైపు (కుడి) పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్ర వైపు (ఎడమ) పనులు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు సాగక పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పాటే 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. వీటిని 8 బ్లాకులుగా విభజించారు. ప్రస్తుతం వరద నేపథ్యంలో 4 బ్లాకుల్లోని పనులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ పరిధిలోని 13 కి.మీ. గ్రావిటీ కెనాల్‌లోనూ నీళ్లు చేరడంతో అక్కడ పనులు నెమ్మదించాయి. 60 హెచ్‌పీ మోటార్లు 6 ఏర్పాటు చేసి డీ వాటరింగ్‌ చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు.  

ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్‌ఫ్లో
నిన్నమొన్నటి వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగవ ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరగ్గా, బుధవారం నుంచి క్రమంగా తగ్గాయి. మంగళవారం 21 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా, బుధవారం ఉదయానికి 13 వేల క్యూసెక్కులకు చేరాయి. సాయంత్రానికి 5,050 క్యూసెక్కులకు చేరాయి. మహారాష్ట్ర బాబ్లీ గేట్లను తిరిగి ఈ నెలాఖరున ఎత్తిన తర్వాతే దిగువకు భారీ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉంటుంది. సింగూరులోకి 2,113 క్యూసెక్కులు, ఎల్లంపల్లిలో 2,040, కడెంలో 1,860 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఇక కృష్ణా బేసిన్‌లో తుంగభద్రలోకి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జూరాలకు 2,700 క్యూసెక్కుల వరద వస్తోంది. 

మరిన్ని వార్తలు