300 మంది ఖైదీలకు క్షమాభిక్ష!

17 Dec, 2015 02:37 IST|Sakshi

సర్కారు అనుమతిస్తే జనవరి 26న విడుదల
 సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏళ్లకేళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు త్వరలోనే స్వేచ్ఛ లభించనుంది. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున (జనవరి 26న) విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఏర్పాటైన జైలు సూపరింటెం డెంట్ల కమిటీ ఓ జాబితాను తయారు చేసింది. జైలు నిబంధనలకు లోబడి సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలతో పాటు వృద్ధులకూ విముక్తి కల్పించాలని నిర్ణయించారు.

ఈ మేరకు అర్హత కలిగినవారి జాబితాతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఇందులో దాదాపు 250 మంది జీవిత ఖైదీలు, 50 మంది వరకు వృద్ధులకు చోటు దక్కినట్లు సమాచారం. ఈ నివేదికపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం ప్రభుత్వం ఖైదీల విడుదలకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఎలాంటి మార్పు చేర్పులు చేయకపోతే జనవరి 26న పెద్ద సంఖ్యలో ఖైదీలు విడుదలయ్యే అవకాశముంది. చివరగా 2011లో కొన్ని తీవ్ర నేరాలకు పాల్పడినవారు మినహా సత్ప్రవర్తన కలిగిన కొద్ది మందిని క్షమాభిక్షపై విడుదల చేశారు.
 

>
మరిన్ని వార్తలు