విద్యుత్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ

1 May, 2018 01:50 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన టీఎస్‌ ట్రాన్స్‌కో.. చైర్మన్‌గా శ్రీనివాసరావు నియామకం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను సవరించేందుకు ఈ పీఆర్‌సీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శ్రీనివాసరావును పీఆర్‌సీ చైర్మన్‌గా నియమించింది. ఆయనతో పాటు ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌), ఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌) టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌), డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) పీఆర్‌సీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ట్రాన్స్‌కో చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌ సంస్థల్లో పని చేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు సంబంధించిన జీతాలపై అధ్యయనం చేయాలని, అన్ని యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని పీఆర్‌సీకి మార్గదర్శకాలను ఈ ఉత్తర్వుల్లో సూచించింది. విద్యుత్తు సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. జీతాల పెంపు భారం రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై భారం పడకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం విద్యుత్తు సంస్థల్లో నాలుగేళ్లకోసారి వేతన సవరణ అమలవుతోంది. ప్రస్తుత వేతన సవరణ సంఘం గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త పీఆర్‌సీ ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యుత్తు ఉద్యోగుల యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపుల మేరకు వేతన సవరణ ఒప్పందం జరుగుతుంది. పీఆర్‌సీ కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకే ఉద్యోగుల వేతనాలను ఎంత మేరకు పెంచాలనేది ఖరారవుతుంది. ఈ సిఫారసులకు ఎప్పుడు ఆమోదించినా.. సవరించిన వేతనాలు 2018 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.  

మరిన్ని వార్తలు