పీఆర్‌సీ గడువు మరోసారి పొడిగింపు?

14 Feb, 2020 03:09 IST|Sakshi

డిసెంబర్‌ 31 వరకు పొడిగించే అవకాశం

ఈలోగా ఉద్యోగులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని నిర్ణయం

పీఆర్‌సీ అమలుకు ముందే డీఏను బేసిక్‌ పేలో కలిపి ఇవ్వాలని ప్రతిపాదన

ఐఆర్‌ ఇవ్వడం కంటే ఇలాచేస్తే తక్కువ ఆర్థికభారం..

వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలుకు యోచన

సాక్షి, హైదరాబాద్‌ : వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) గడువు మరోసారి పొడిగించే అవకాశం ఉంది. ఈ నెలలో గడువు ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్‌ 31 వరకు పొడిగించాలని పీఆర్‌సీ కమిటీ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. దీంతో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పీఆర్‌సీ వ్యవహారాలే కాకుండా రాష్ట్ర కార్యాలయాలు, జిల్లాల్లో వర్క్‌లోడ్, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, ఉండాల్సిన సిబ్బంది సంఖ్య, ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు నిబంధనలు తదితర అంశాలను తేల్చే బా«ధ్యతలను ప్రభుత్వం పీఆర్‌సీకి అప్పగించింది. అయితే ఇవన్నీ కసరత్తు చేసేందుకు మరింతగా సమయం అవసరం కావడంతో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దీంతో పీఆర్‌సీ అమలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈలోగా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసేందుకు కొంత ఉపశమనం కలించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

డీఏ మెర్జ్‌ చేయడమా.. ఐఆర్‌ ఇవ్వడమా?
పీఆర్‌సీ అమలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వడమా? లేక పీఆర్‌సీ అమలు చేయాల్సిన 1–7–2018 నాటికి ఉన్న డీఏను బేసిక్‌ పేలో కలిపి కొత్త బేసిక్‌తో వేతనాలు చెల్లించడమా? అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగులకు ఐఆర్‌ ఇవ్వాల్సి వచ్చినా ప్రభుత్వంపై అధికంగా ఆర్ధికభారం పడుతుంది. ఒక్క శాతం ఐఆర్‌ ఇవ్వాలంటే ఏటా రూ.225 కోట్ల చొప్పున వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ గతంలోనే అంచనా వేసింది. ఈ లెక్కన 27 శాతం ఇవ్వాలంటే రూ.6,075 కోట్లు అవసరమవుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 27 శాతం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో అంతకంటే తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దీంతో ఐఆర్‌ కాకుండా పీఆర్‌సీ అమలు చేయాల్సిన తేదీ 1–7–2018 నాటికి ఉన్న కరువు భత్యాన్ని (డీఏ) ప్రస్తుతం ఉన్న పాత బేసిక్‌ పేలో కలిపి కొత్త వేతనం ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

1–7–2018 నాటికి 30,292 శాతం డీఏ ఉండగా, ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు 3.244 శాతం డీఏ పెరిగి ప్రస్తుతం 33.536 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పీఆర్‌సీ అమలు తేదీ నాటికి ఉన్న డీఏను మెర్జ్‌ చేసి కొత్త బేసిక్‌ పేతో వేతనం ఇస్తే ఉద్యోగులకు కొంత ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) పెరుగుతుంది. దానికి మిగతా 3.244 డీఏ, ఇతర అలవెన్స్‌లు కూడా కలుస్తాయి. దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా హెచ్‌ఆర్‌ఏపై రూ.20వేల పరిమితి ఉంది. అంటే రూ.66,640 బేసిక్‌ పే దాటితే ఆయా ఉద్యోగులకు కొత్త వేతనం వస్తుందే తప్ప.. హెచ్‌ఆర్‌ఏ పెరగదు. అయితే బేసిక్‌ పే రూ.66,640లోపు ఉన్న ఎక్కువ మంది ఉద్యోగులకు మాత్రం హెచ్‌ఆర్‌ఏ రూపంలో ప్రయోజనం చేకూరనుంది.

పదవీ విరమణ వయసు పెంపు..
ఉద్యోగులకు కొంత ప్రయోజనం చేకూర్చడంతోపాటు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచడం ద్వారా వారికి కొంత శాంతపరచవచ్చని, ఫలితంగా పీఆర్‌సీ ఆర్థిక భారం నుంచి మినహాయింపు పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పదవీ విరమణ వయసు పెంపునకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా 2023 మార్చి 31 నాటికి రిటైరయ్యే 26,133 మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. వీటిన్నింటినీ వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఇదీ వేతన లెక్క...

జిల్లాల్లో రూ.42,490–96,110 స్కేల్‌లో పనిచేసే ఉద్యోగికి ప్రస్తుతం వస్తున్న వేతనం (రూ.లలో)
బేసిక్‌ పే                                    77,030    
ప్రస్తుత డీఏ     (33.5366 శాతం)   25,833
హెచ్‌ఆర్‌ఏ (12 శాతమైతే)            9,244
మొత్తం                                1,12,107

–––––––––––––––––––––––––––––––––––
డీఏ మెర్జ్‌ చేస్తే వచ్చే వేతనం (రూ.లలో)
బేసిక్‌ పే                                                    77,030    
1–7–2018 నాటికి ఉన్న డీఏ (30,292 శాతం) 23,334
ఆ డీఏ కలిపితే వచ్చే బేసిక్‌ పే                     1,00,364
1–7–2018 తరువాత పెరిగిన డీఏ (3.244 శాతం)    3,256
హెచ్‌ఆర్‌ఏ (12 శాతమైతే..)                     12,044
మొత్తం వేతనం                         1,15,664

–––––––––––––––––––––––––––––––––
అదే ఉద్యోగికి 27 శాతం ఐఆర్‌ ఇస్తే..
బేసిక్‌ పే                                        77,030
ఇప్పటివరకు ఉన్న డీఏ (33.536 శాతం) 25,833
హెచ్‌ఆర్‌ఏ (12 శాతమైతే)                    9,244
ఐఆర్‌                                           20,798
మొత్తం వేతనం                             1,32,905  

మరిన్ని వార్తలు