త్వరలోనే పీఆర్‌సీ..!

16 May, 2018 04:48 IST|Sakshi
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్

జూన్‌ 2న ఫిట్‌మెంట్‌ ప్రకటన

15–20 రోజుల్లోనే అధ్యయన ప్రక్రియ పూర్తికి నిర్ణయం

నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం

సీపీఎస్, రిటైర్మెంట్‌ వయసు పెంపు, బదిలీలపై ఉత్కంఠ

డీఏ చెల్లింపులు, హెచ్‌ఆర్‌ఏ పెంపు  ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి నిర్ణీత గడువు లోపలే పదకొండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు అమలు కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా వచ్చే జూన్‌ 2న కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని యోచిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పదో పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్‌ 30న ముగుస్తుంది. పదకొండో పీఆర్సీ ఎప్పుడు వేసినా దానిని ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 2న పీఆర్సీ అమలును ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.

శరవేగంగా ప్రక్రియ..
గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం వేతన కమిషన్‌ ఏర్పాటు, అధ్యయనం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు వంటి ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు దాదాపు ఏడాది కాలం పట్టేది. దీనికి భిన్నంగా వీలైనంత వేగంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేసేలా సీఎం కేసీఆర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీఆర్సీ అధ్యయనాన్ని, వివిధ సంఘాలతో చర్చలను కేవలం 15 రోజుల్లో పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రులు, అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్‌ రెండో తేదీనే పీఆర్సీ తీపి కబురు అందించాలని సీఎం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదో పీఆర్సీకి సంబంధించి బకాయిల చెల్లింపు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. దీంతో కొత్త పీఆర్సీ చెల్లింపులను జూలై నుంచే చేయాలా.. నవంబర్‌ తర్వాత నుంచి ఇవ్వాలా అన్నదిశగా ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

నేడు స్పష్టత వచ్చే అవకాశం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇదే వేదికగా పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లు, తమ సిఫారసుల నివేదికను మంగళవారం సీఎంకు అందించింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ గడువు గతేడాది మార్చి నెలాఖరుతోనే ముగిసింది. 50 శాతానికిపైగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జరిపే చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక బుధవారం నాటి భేటీ సందర్భంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల చెల్లింపు, ఉద్యోగుల బదిలీలు, ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వుల రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం రద్దు, రిటైర్మెంట్‌ వయో పరిమితి పెంపు తదితర అంశాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాస్మోపాలిటన్‌ నగరాల తరహాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను 40 శాతం పెంచడం, కార్పొరేషన్ల పరిధిలో 30 శాతానికి, తదుపరి కేటగిరీని 20 శాతానికి పెంచే ప్రతిపాదన కూడా సీఎం పరిశీలనలో ఉంది. 

మరిన్ని వార్తలు