'అక్కడ' ముందస్తు దసరా ఉత్సవాలు!

4 Oct, 2019 09:07 IST|Sakshi
రావుడ్‌ దేవతలకు మొక్కుతున్న భక్తులు

నేడు జంగుబాయి సన్నిధిలో ప్రారంభం

ఐదురోజుల ముందు నిర్వహించడం ఆనవాయితీ

తరలిరానున్న ఇరురాష్ట్రాల ఆదివాసీలు

పోచమ్మతల్లికి నవధాన్యాలు

పెద్దలుగా వ్యవహరించనున్న కటోడాలు ఏర్పాట్లు పూర్తి

సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్‌): మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహరాజ్‌గూడ అడవుల్లో బస చేసిన జంగుబాయి సన్నిధిలో నేడు విజయదశమి దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు హాజరుకానున్నారు. ఈ ఏడాది పండిన ఆహారధాన్యాలను సాంప్రదాయబద్ధంగా పోచమ్మతల్లికి చూపిస్తారు. అక్కడున్న రావుడ్‌ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మైసమ్మ, జంగుబాయి కొలువైన గృహల్లోకి వెళ్లి ప్రార్ధనలు చేస్తారు. ఎనిమిది వంశీయుల కటోడాలు పెద్దగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరో రెండు మాసాలు తర్వాత ప్రారంభం కానున్న జంగుబాయి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. 

అనాది నుంచి వస్తున్న ఆచారం

పోచమ్మ ప్రతిమలు 

ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని నేటికీ ఆదివాసీలు నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం విజయదశమికి ఐదు రోజులు ముందు అమ్మవారి సన్నిధిలో ముందస్తుగా దసరా పండుగ నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, మహారాష్ట్రలోని వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీ భక్తుల రానున్నారు. ఇది ఆధ్యాంతం భక్తి భావంతో కొనసాగుతాయి. ఈ గురువారం రాత్రి పోచమ్మతల్లికి, ఇతరత్రా దేవతలకు పూజలు నిర్వహించి మొక్కులు కోరుకుంటారు. టొప్లకసలోని గంగాజలం తీసుకవచ్చి దేవతా విగ్రహాలను శుద్ధి చేస్తారు. నేటి ఉదయం నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల వారికి దసరా ఉత్సవం జరుపుకుంటున్న విషయాన్ని తెలియజేశారు. ఇటీవల ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని దసరా పండుగతోపాటు డిసెంబర్‌ చివరి వారంలో ప్రారంభం కానున్న జంగుబాయి ఉత్సవాల గురించి చర్చించారు. 

మరిన్ని వార్తలు