ఎన్ని‘కలవరం’! 

24 Jun, 2018 08:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షిప్రతినిధి, ఖమ్మం : వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలలో ఉంటాయనుకున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఆరు నెలలు ముందుగానే.. అంటే ఈ ఏడాది డిసెంబర్‌లోనే జరుగుతాయనే ప్రచారంతో..రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలో పట్టును నిలుపుకునేందుకు నియోజకవర్గాల వారీగా ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల గోదాలోకి దిగి నువ్వా..నేనా అనే రీతిలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ తన సత్తాను చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆగస్టు నెలాఖరులోపే పోటీచేసే అభ్యర్థుల  జాబితాను ప్రకటిస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో ఈలోపే తాము పూర్తి పట్టుతో ఉన్నామనే భావన కలిగించేందుకు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు తమవంతు పోరు సలుపుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి జలగం వెంకట్రావు గెలుపొందడంతో..టీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క సీటు మాత్రమే లభించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో..2014 సెప్టెంబర్‌లో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడం, ఆ తర్వాత ఆయనతోపాటు టీడీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు చేరారు. అదే క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్‌లు ఆయా సందర్భాల్లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

అలాగే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్యలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరడం, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఖాళీ అయిన పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మంత్రి తుమ్మల విజయం సాధించారు. 2015లో స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీ చేసిన బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దీంతో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అధికార పార్టీ శాసనసభ్యుల సంఖ్య ఏడుకు చేరడంతోపాటు ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు, శాసనమండలి సభ్యుడు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఈసారి అత్యధిక స్థానాలు గెలుపొందేలా పార్టీ అధినాయకత్వం ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలను రూపొందించింది. సమన్వయం కోసం పార్టీ కార్యకర్తలతో, ద్వితీయశ్రేణి నేతలతో ప్రత్యేక సమావేశాలకు ప్రజాప్రతినిధులు తెర లేపారు. 

ఇటు మంత్రి నేతృత్వం.. అటు కాంగ్రెస్, వామపక్షాల వేగం.. 
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నా..అందుకు దీటుగా కాంగ్రెస్, వామపక్షాలు సైతం ఆయా నియోజకవర్గాల్లో గట్టి పోటీని ఇస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, మంజూరుపై దృష్టి సారించి, నేతలకు మార్గనిర్దేశం చేసి ఇక పోలింగ్‌ రాజకీయాలపై నజర్‌ పెట్టబోతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ బలాలు, బలహీనతలు, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తి, ద్వితీయశ్రేణి నేతల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలపై శ్రద్ధతో పాటు, పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలో బలంగా ఉన్న వామపక్షాలు ప్రజా సమస్యలపై దశలవారీగా పోరాటాలు నిర్వహించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టు చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2014లో గెలిచిన స్థానాలతోపాటు మిగిలిన సీట్లపై కాంగ్రెస్‌ పార్టీ వ్యూహప్రతివ్యూహాలను రూపొందించుకుంటోంది.  కాంగ్రెస్‌ పార్టీ తరఫున మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తున్నారు. అయితే..ఈ పార్టీలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు..? ఎవరికి అధిష్టానం ఆశీస్సులు లభిస్తాయన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఆశావహులు కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నా..

టికెట్‌ తమకే వస్తుందని, ఎన్నికలకు పూర్తి స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేయలేని పరిస్థితి నెలకొంది. సీపీఎం భద్రాచలం స్థానాన్ని దక్కించుకోవడంతోపాటు తమకు బలంగా ఉన్న పాలేరు, మధిరలపై దృష్టి సారించింది. సీపీఐ కొత్తగూడెం, వైరాతోపాటు అశ్వారావుపేట నియోజకవర్గంలోనూ పాగా వేసేందుకు, తద్వారా తమ రాజకీయ సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సండ్ర వెంకటవీరయ్య, భద్రాచలం నియోజకవర్గానికి సీపీఎం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సున్నం రాజయ్యలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి దీటుగా పట్టు నిలుపుకునేందుకు చెమటోడుస్తున్నారు.  

అధికార పార్టీలో ఇలా.. 
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, బాణోతు మదన్‌లాల్, జలగం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న రోజువారీ రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అందుకు అనుగుణంగా రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం కోసం, ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు మంత్రి తుమ్మల గత కొద్దినెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరపి లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పోలింగ్‌ బూత్‌స్థాయి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి కమిటీలో 10మంది కార్యకర్తలు ఉండేలా ప్రణాళికను రూపొందించి బూత్, డివిజన్‌స్థాయి సమస్యలపై దృష్టి సారిస్తున్నారు.   

మరిన్ని వార్తలు