న్యూఇయర్‌ వేడుకలకు బయటకు వెళ్తున్నారా..

31 Dec, 2017 18:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త సంవత్సర వేడుకలకు భాగ్య నగరం సర్వం సిద్ధమౌతోంది. పార్టీలు, పబ్బులు, క్లబ్బులు కొత్త కొత్త డీజేలతో యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. కొంత మంది దూరంగా వెళ్లి న్యూఇయర్‌ వేడుకలను జరుపుకుంటారు. మరికొందరు ఇంట్లోనే చేసుకుంటారు. అయితే బయటకు వెళ్లే వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  మీకోసం కొన్ని ప్రత్యేక విషయాలు, జాగ్రత్తలు...


మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకూడదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కోసం 120 బృందాలను  హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దించారు. ఒకవేళ పట్టుపడితే 15రోజుల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గత ఏడాది సుమారు 7,500 మంది జైలుకెళ్లారు.

► బార్‌లలో పీకల దాకా తాగి రోడ్ల మీద అల్లరులకు పాల్పడకూడదు, డీజేలతో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.

నిర్ణీత సమయం దాటిన తర్వాత పబ్‌లు, క్లబ్‌ల్లో ఉండకూడదు. మైనర్లు పబ్‌లకు వెళ్లకూడదు. ఒక వేళ వెళ్లారంటే అంతే సంగతులు.

ఔటర్‌ రింగురోడ్డుపై రాత్రి 9 నుంచి వేకువజామున 3గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. మద్యం తాగి ఎవరూ రింగ్‌రోడ్డుపై  ప్రయాణించడానికి వీలు లేదు.

మీరు చేసే ప్రతిపని సీసీ కెమెరాల ద్వారా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించబడతాయి.

రాత్రి 9 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్లు మూసేసి ఉంటాయి. ఏఒక్క వాహనానికి ఫ్లై ఓవర్లపై అనుమతి ఉండదు.

అతిగా మద్యం సేవించిన వారు క్యాబుల్లో ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ఉచితంగా క్యాబ్‌ సర్వీసులను అందిస్తోంది. ఫోన్‌ నెంబర్లు :  91776 24678, 88970 62663

అంతేకాకుండా దూర ప్రాంతాల వారికోసం హైదరాబాద్‌ మెట్రో ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనుంది. నాగోల్, మియాపూర్‌ స్టేషన్ల నుంచి రాత్రి 2.30 గంటలకు చివరి రైళ్లు బయలుదేరతాయి.

వేడుకల్లో ఏమైనా గొడవలు, అల్లరులు, ఇబ్బందులు తలెత్తితే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి, లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయండి.

మరిన్ని వార్తలు