అధిక రక్తస్రావంతో బాలింత మృతి

21 Apr, 2020 10:09 IST|Sakshi
విజయ (ఫైల్‌)

వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని భర్త ఆరోపణ

ఘటనపై విచారణ జరిపించాలి: బాలల హక్కుల సంఘం

వనస్థలిపురం: వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ బాబుకు జన్మనిచ్చిన తర్వాత అధిక రక్తస్రావంతో మృతి చెందింది. సరైన చికిత్స అందక వేరే ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్య, రక్తం ఎక్కించే సదుపాయాలు లేకపోవడంతో బాలింత మృతి చెందిందని ఆమె భర్త సతీష్‌ ఆరోపిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ములుగుకు చెందిన లెక్చరర్‌ సముద్రాల సతీష్‌ భార్య విజయ (29) రెండో కాన్పు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి హయత్‌నగర్‌లో తన సోదరి వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి 1.30 గంటలకు నొప్పులు రావడంతో ప్రైవేటు ఆసుపత్రులు నడవక పోవడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం 4గంటల సమయంలో విజయ బాబుకు జన్మనిచ్చింది. కాగా విజయకు అధిక రక్తస్రావం అవుతుండడంతో 5గంటల సమయంలో ఆసుపత్రికి చెందిన అంబులెన్సులో నగరంలోని జడ్జీఖానా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ విజయ చికిత్స పొందుతు మృతిచెందింది. విజయ మృతితో రెండేళ్ల మొదటి కుమారుడు, అప్పుడే పుట్టిన బాబు తల్లి లేని పిల్లలు అయ్యారని బంధువులు వాపోతున్నారు.

జాండీస్, బ్లీడింగ్‌తోనే మృతి...
విజయకు నార్మల్‌ డెలివరీ అయ్యింది. కాగా ఆమె జ్వరం, జాండీస్‌తో బాధ పడుతోంది. డెలివరీ అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం జడ్జిఖానా ఆసుపత్రికి పంపించాం. అక్కడ చికిత్స పొందుతు విజయ మృతి చెందింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదు.    – సూపరిండెండెంట్‌ హరిప్రియ, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి

రక్తం ఎక్కించే సదుపాయం లేకపోవడం శోచనీయం...
ఏరియా ఆసుపత్రిలో రక్తం ఎక్కించే సదుపాయం లేకపోవడం శోచనీయం. ప్రసవం సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే విజయ చనిపోయింది. ఆమె ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.    – అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం

మరిన్ని వార్తలు