బస్టాప్‌ వెనుక ప్రసవం

20 Jul, 2020 01:22 IST|Sakshi
బీబీని వీల్‌ చైర్‌పై తీసుకువెళ్తున్న సిబ్బంది (ఇన్‌సెట్లో) తల్లీబిడ్డ

నిండు గర్భిణిపై వైద్యుల నిర్లక్ష్యం

నొప్పులతో విలవిల్లాడిన గర్భిణి

రెండు గంటల నరకయాతన

జనగామలో దారుణం

జనగామ: నిండు గర్భిణి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో రెండు గంటలు నరకయాతన అనుభ వించింది. నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు కనికరించలేదు. రక్తం తక్కువగా ఉందని... హన్మకొండకు తీసుకెళ్లమని చెప్పి చేతులెత్తేశారు. అంబులెన్స్‌ అందుబాటులో లేక ఆ గర్భిణి పురిటి నొప్పులతో విలవిల్లాడి పోయింది. చివరకు ప్రభుత్వాసుపత్రి పక్కనే రోడ్డుపైనున్న బస్టాప్‌ వెనుకకు వెళ్లి పడిపోయింది. అక్కడే ప్రసవించింది. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్‌హిల్స్‌ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జరిగింది. వైద్యసిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన షేక్‌ హుస్సేన్‌ తన భార్య షేక్‌ బీబీని నాలుగో కాన్పు కోసం ఆదివారం చంపక్‌హిల్స్‌ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాని(ఎంసీహెచ్‌)కి తీసుకు వచ్చాడు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో ఎంసీహెచ్‌కు తరలించారు. ఉదయం 10 గంటలకు డాక్టర్‌ను సంప్రదిం చగా, కాన్పు కోసం మెటర్నిటీ వార్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యురాలు, గర్భిణికి రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తించి వెంటనే హన్మకొండ మెటర్నిటీ దవాఖానాకు రెఫర్‌ చేశారు. మరోవైపు బీబీకి నొప్పులు తీవ్రమ య్యాయి. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ‘కాన్పు చేయండి.. ఏం జరిగినా మాదే బాధ్యత’ అంటూ వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదు. 

అంబులెన్స్‌ కోసం నిరీక్షణ
హన్మకొండకు వెళ్లేందుకు బయటకు వచ్చిన గర్భిణికి అంబులెన్స్‌ కనిపించక పోవడంతో అక్కడే నిరీక్షించింది. గంటసేపు ఎదురు చూసి ప్రైవేట్‌ వాహనంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యు లు సిద్ధమయ్యారు. అప్పటికే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న షేక్‌బీబీ... ఆస్పత్రి గేటుబయట బస్టాప్‌ వెనకకు వెళ్లింది. నిమిషం వ్యవధిలోనే అరుపులు, కేకలు వినిపించడంతో తల్లీ, భర్త అటు వైపు వెళ్లారు. పండంటి కొడుకును చేతిలో పట్టు కుని, అలాగే గోడకు కూర్చుని ఉన్న బీబీని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నా బిడ్డను కాపా డండి అంటూ తల్లి కన్నీటిపర్యంతం కావడంతో డాక్టర్, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. తల్లిబిడ్డను ఎమర్జెన్సీవార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఎంసీహెచ్‌ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి ఆరా 
జనగామలో గర్భిణి ఆస్పత్రి బయటనే ప్రసవించిన సంఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరా తీశారు.  ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చే పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎంపీ కోమటిరెడ్డి సూచించారు. ఎంపీ స్థానిక నాయకుల ద్వారా బాధిత మహిళ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.  

గర్భిణికి అధిక రక్తస్రావం కావడం వల్లే...
గర్భిణి షేక్‌ బీబీకి అధిక రక్తస్రావం జరి గింది. హన్మకొండ ఆస్పత్రికి వెళ్లాలని రెఫర్‌ చేశాం. బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో రక్తం యూనిట్లు ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. అందుకే డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్‌ కూడా సిద్ధం చేయగా, కుటుంబ సభ్యులు హన్మకొండకు వెళ్లేందుకు విముఖత చూపించి సిద్దిపేటకు వెళ్తామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె బయటకు వెళ్లడంతో కాన్పు జరిగిపోయింది. ఇందులో మా నిర్లక్ష్యం లేదు. – డాక్టర్‌ పజారి రఘు, ఎంసీహెచ్‌ సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు