‘యాదాద్రి’ జిల్లాలో తొలి కరోనా మరణం

3 Jun, 2020 13:33 IST|Sakshi
గ్రామస్తులను విచారిస్తున్న సీఐ నర్సయ్య, అధికారులు

వైరస్‌ సోకి బాలింతమృత్యువాత

రాజాపేట మండలం దూదివెంకటాపురంలో ఆలస్యంగా వెలుగులోకి..

రాజాపేట(ఆలేరు) : యాదాద్రి జిల్లాలో తొలి కరోనా మరణంనమోదైంది. జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో వైరస్‌ అంటుకుని ఓ బాలింత మృత్యువాత పడింది. వివరాలు..  గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నాగరాజు భార్య సంతోష (23)కు ఒక్కటిన్నర సంవత్సరాల కుమార్తె ఉంది. కాగా మళ్లీ గర్భిణిగా ఉండటంతో రాజాపేటలో వైద్యపరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువగా ఉందని చెప్పడంతో జనగామ జిల్లా బచ్చన్నపేటలోని తన తల్లిగారింటికి వెళ్లింది. గత నెల 28న జనగామలోని ఎంసీహెచ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో తిరిగి రాజాపేట ప్రభుత్వ అస్పత్రికి రావడంతో వైద్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో సంతోష తిరిగి జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ కూడా సంతోషను ఉస్మానియాకు రెఫర్‌ చేయడంతో 29న హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సంతోష పరిస్థితి అందోళనకరంగా ఉండటంతో వైద్యులు రక్తం ఎక్కించి 31న ఉస్మానియాకు పంపించారు. అక్కడ రాత్రి సంతోష మగశిశువుకు జన్మనివ్వగా మృతిచెందాడు. ఈ నెల 1 సంతోష ప రిస్థితి విషమించి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందింది.అక్కడి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది.

తొమ్మిది మందిని క్వారంటైన్‌కు తరలింపు
దూదివెంకటాపురం గ్రామంలో కరోనాతో మహిళ మృతిచెందిందన్న వార్తతో అధికారులు ప్రైమరి, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. సంతోష భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు మామ ఎర్రోళ్ల మాతయ్య, భార్య మైసమ్మ, రెండో కుమారుడు కర్ణాకర్, భార్య హారిక, సంతోష కుమార్తె హేమశ్రీ, ఇంటి పక్కనే ఉంటున్న మాతయ్య సోదరుడు వెంకటయ్య, భార్యతోపాటు సంతోష తల్లితో కలిపి 9 మందిని అధికారులు బీబీనగర్‌ ఏయిమ్స్‌కు తరలించారు.  కాగా మరో 20 మందిని సెకండరీ కాంటాక్టులుగా గుర్తించినట్లు తెలిపారు. అంతే కాకుండా సంతోషను ఉస్మానియా అస్సత్రిలో చూడటానికి వెళ్లినవారితోపాటు కుటుంబ సభ్యులను నలుగురిని బచ్చన్నపేటలో ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి అక్కడి అధికారులకు సమాచారం అందించారు.

భయాందోళనలో గ్రామస్తులు
గ్రామ పంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తున్న నాగరాజు అందరితో కలివిడిగా ఉండేవాడు. ఒక్కసారిగా అతని భార్య కరోనాతో మృతిచెందిందని తెలియడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా భయాందోళనకు గురి అవుతున్నారు. నాగరాజు నిత్యం విధుల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేవాడు. కాగా నాగరాజు అందరితో కలిసి ఉండటం, కలిసి మాట్లాడాడని గ్రామస్తులంతా కరోనా వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.

గ్రామంలో శానిటేషన్‌ పనులు
గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రిధర్‌ సర్పంచ్‌ వస్పరి ధనలక్ష్మి విష్ణులు గ్రామంలో శానిటేషన్‌ పనులు ప్రారంభించారు. వాటర్‌ ట్యాంకర్‌లో బ్లీచింగ్‌ ఫౌడర్‌ను కలిపి స్ప్రేచేయడంతోపాటు, దండోర వేయించి గ్రామస్తులను ఇంటినుంచి బయటికి రావొద్దని, అత్యవసర పనుల నిమిత్తం వెళితే మాస్కులు తప్పని సరిగా మాస్కు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

నీలగిరిలో కరోనా కలకలం
నల్లగొండ : నీలగిరిలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విజయవాడలో పెట్రోల్‌ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తి నాలుగు రోజుల క్రితం నల్ల గొండలోని ప్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని తన నివాసానికి వచ్చాడు.  ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి  రెండు మాసాలపాటు విజయవాడలో ఉన్నాడు. కోదాడ సమీపంలో పెట్రోల్‌ బంక్‌ వ్యాపారం చేస్తూ లాక్‌డౌన్‌ కారణంగా విజయవాడలో ఉంటూ వ్యాపార లావాదేవీలు చూసుకున్నాడు. గత శుక్రవారం విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండకు వచ్చాడు. అనారోగ్యానికి గురి కావడంతో శనివారం హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరాడు. సోమవారం వారు కరోనా పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్‌ అని రిపోర్డులు వచ్చాయి. దీంతో  డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, సర్వే లైన్‌ డా. రాహుల్‌ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వారినుంచి కూడా కరోనా నమూనాలను తీసి పరీక్షలకు పంపించినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు