లోకాన్ని చూపించకుండానే..!

5 May, 2020 07:59 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : కళ్లు తెరిచి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడదామని 9 నెలలపాటు తల్లి కడుపులో తలదాచుకున్న ఆ పసికందు బయటకు రాకముందే కన్నుమూసింది. కన్నబిడ్డను కళ్లారా చూసి 9 నెలలు పడిన కష్టం మరిచిపోదామనుకున్న ఆ తల్లి కూడా తన ఆశ నెరవేరకుండానే తనువు చాలించింది. ఈ విషాద ఘటన మండలంలోని ప్యారమూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమా..? విధి వంచించిందో.. తెలియదుగాని ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్యారమూర్‌కు చెందిన మమత(21) అదేగ్రామానికి చెందిన క్యాతం సంతోష్‌ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. మమత గర్భం దాల్చినప్పటినుంచి ప్రతినెలా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటోంది.

మమతకు నెలలు నిండడంతో రెండురోజుల క్రితం బంధువుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పురుడుకు ఇంకా సమయం ఉందని చెప్పడంతో అదే ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అదేరోజు సాయంత్రం వైద్యురాలు వచ్చి మమతను పరీక్షించి ప్రసవం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కడుపులోనే పాప మృతిచెందినట్లు గుర్తించారు. మమత పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ కూడా సరైన వైద్యం అందించలేదని, అడ్వాన్సు చెల్లించేవరకూ వైద్యులు రాలేదని మమత భర్త సంతోష్‌ తెలిపారు. డబ్బులు చెల్లించాక.. పరీక్షించి.. వైద్యం అందించేలోపే పరిస్థితి విషమించి మమత ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. 

సమయానికి వైద్యం అంది ఉంటే..
మమతకు సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతోనే తన భార్య మృతి చెందినట్లు సంతోష్‌ ఆరోపించారు. నిర్మల్‌లోని ఆసుపత్రికి సకాలంలో వెళ్లామని, వైద్యులు ఆలస్యంగా స్పందించడంతోనే పాపతోపాటు తల్లి కూడా ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య మృతికి కారణమైన రెండు ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు