బాలింత ప్రాణం తీసిన ఇడ్లీ 

13 Jan, 2020 03:33 IST|Sakshi

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం 

బాబుకు జన్మనిచ్చి మృతి చెందిన తల్లి 

పడుకోబెట్టి ఇడ్లీ తినిపించడంతో ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఇరుక్కోవడంతో మృతి 

సాక్షి, కందుకూరు:  వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్‌సీ)లో చోటుచేసుకుంది. కందుకూరు మండలం ముచ్చర్లకు చెందిన షాబాద్‌ పరమేశ్‌కు ధన్నారం గ్రామానికి చెందిన శివాని (28)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. శివాని రెండోసారి గర్భం దాల్చిన క్రమంలో ప్రతి నెలా పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకుంటుంది. నెలలు నిండటంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు శివానిని పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు వెంకటమ్మ ఆదివారం తెల్లవారుజామున శివానికి పురుడు పోయగా..బాబు జన్మించాడు. గంట అనంతరం ఇడ్లీ తినిపించా లని నర్సు చెప్పడంతో కుటుంబీకులు ఇడ్లీ తెప్పించారు. అయితే ఆ ఇడ్లీలను శివానికి కూర్చోబెట్టకుండా మంచంపై పడుకున్న బాలింతకు అలాగే తినిపించింది. దీంతో ఇడ్లీ శివాని ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.  

పీహెచ్‌సీ ఎదుట ఆందోళన.. 
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శివాని మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహాన్ని కందుకూరు పీహెచ్‌సీకి తరలించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యాధికారులకు సమాచారం అం దించగా వారు అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇడ్లీ ఇరుక్కోవడంతోనే మృతిచెందినట్లు అంగీకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. 

మరిన్ని వార్తలు