గర్భిణి మృతి

13 Feb, 2019 02:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువుల ఆందోళన

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం వల్ల గర్భిణి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆమె తరఫు బంధువులు ఆస్పత్రి ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాళ్లసంకీస గ్రామానికి చెందిన గుగులోతు ఉమ (25) ఏడు నెలల గర్భవతి. కడుపులో  నొప్పిగా ఉండటంతో ఈ నెల 8న ఆమెను కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

రెండు రోజులపాటు వైద్య సేవలందించారు. 10న స్నేహ డయాగ్నస్టిక్స్‌లో స్కానింగ్‌ చేయించగా.. పరిశీలించిన వైద్యులు ఆమె పరిస్థితి బాలేదని, వరంగల్‌ ఎంజీఎంకు రెఫర్‌ చేశారు. ఆమెను వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు కడుపులో పిండం కదలిక లేకపోవడంతో ఆమె శరీరం విషతుల్య మైందని చెప్పారు. బతకడం కష్టమని చెప్పగా.. ఆమె మంగళవారం ఉదయం మృతి చెందింది. దీనికి ఖమ్మం ఆస్పత్రి వైద్యులే కారణమని ఆమె కుటుంబీకులు నిర్ధారణకు వచ్చి మృతదేహాన్ని తరలించి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మరిన్ని వార్తలు