‘అమ్మఒడి’ని సద్వినియోగం చేసుకోవాలి

24 Jan, 2018 19:22 IST|Sakshi
వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లెందు :  అమ్మఒడి పథకాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి దయానందస్వామి అన్నారు. ఇల్లెందు మండలం కొమురారం, రొంపేడు పీహెచ్‌సీల పరిధిలో అమ్మఒడి పథకం కింద మంజూరైన ‘102’ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ పథకంలో ప్రయోజనం పొందే గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, గర్భం దాల్చిన నాటినుంచి ప్రసూతి అయిన తర్వాత కూడా ఆరు నెలల పిల్లల టీకాల వరకు ఈ 102 వాహనం ఉచిత సేవలు అందిస్తుందని వివరించారు. 2016 డిసెంబర్‌లో జిల్లాకు తొలివిడతలో 7 వాహనాలు కేటాయించగా, ఇప్పుడు మలి విడతలో నాలుగు వచ్చాయని తెలిపారు.

ఈ నాలుగు వాహనాలను  కొమురారం, సుజాతనగర్, జగన్నాధపురం, అశ్వారావుపేటకు కెటాయించినట్లు తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామన్నారు. గర్భిణుల నుంచి ఫోన్‌ నంబర్‌లను సేకరించి డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని, తద్వారా గర్భిణులు ఏ రోజు హాస్పిటల్‌కు వెళ్లాలో మూడు రోజుల ముందే సమాచారం అందుతుందని చెప్పారు. స్థానిక ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలను అలర్ట్‌ చేస్తారన్నారు. ఈ వాహనంలో డ్రైవర్‌ మాత్రమే ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ అమ్మఒడి ప«థకం అద్భుతమైనదని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వైద్యం పట్ల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు అనేక మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అందరికీ వైద్యం అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ దిండిగల రాజేందర్, జడ్పీటీసీ చండ్ర అరుణ, ఎంపీపీ మూడు సరస్వతీ, అమ్మ ఒడి పథకం జిల్లా కో ఆర్డినేటర్‌ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ భద్రమ్మ, సర్పంచ్‌ భీంజీ, ఇల్లెందు ఏరియా వైద్యులు డాక్టర్‌ చిన్ని కృష్ణ, కొమురారం డాక్టర్‌లు సునిత, జాయిస్,  ఎస్‌ఐ కొమురెల్లి పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు