విమాన టికెట్‌ ధరలకు పోటీగా..

20 Feb, 2020 02:01 IST|Sakshi

ప్రీమియం రైళ్ల సెకండ్‌ క్లాస్‌ టికెట్‌ రేటు: రూ. 4,800  

అదే ఢిల్లీకి విమానం ధర రూ. 4,500

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ మొదటి, రెండో తరగతి వెయిటింగ్‌ లిస్ట్‌ 50కు మించి ఉంది. తత్కాల్‌లో కూడా టికెట్లు లభించక ప్రయాణికులు ఉసూరుమన్నారు. కిక్కిరిసి ఆ రైలు ఢిల్లీకి పరుగుపెట్టింది.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ మీదుగా ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ వచ్చింది. ఫస్ట్‌ క్లాస్‌ బోగీలో ఐదుగురు, సెకండ్‌ క్లాస్‌ బోగీల్లో 15 మంది ఉన్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీ. వెలవెలబోతూ ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ బయల్దేరింది. 

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ దొరకని ప్రయాణికులు ‘రాజధాని’ వైపు ఎందుకు చూడలేదు. ప్రత్యామ్నాయంగా అదేరోజు ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులో ఉన్నా.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునేందుకే ఎందుకు మొగ్గు చూపారు. ఎందుకంటే ఆదాయ వేటలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలే కారణం.

సాక్షి, హైదరాబాద్‌: విమానయాన సంస్థలో అమల్లో ఉన్న డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ ఇప్పుడు చేతులు కాల్చుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి టికెట్‌ ధరను సవరించటమే ఈ విధానం. ఎక్కువ డిమాండ్‌ ఉన్న రోజులు, అప్పటికప్పుడు బుక్‌ చేసుకున్న సందర్భంలో టికెట్‌ ధర అమాంతం పెరుగుతుంది. ఇంతకాలం పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లాలన్న ఆ శాఖ ఇప్పుడు ఈ విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని చూస్తోంది. ఇటీవల రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ హైదరాబాద్‌ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.  ఆయన దాన్ని సమీక్షించేందుకు ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ నుంచే  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇదీ సంగతి..
హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి డిమాండ్‌ లేని సాధారణ రోజుల్లో అడ్వాన్సుగా టికెట్‌ బుక్‌ చేసుకుంటే విమాన చార్జీ రూ.4 వేల లోపు ఉంటుంది. అప్పటికప్పుడు బుక్‌ చేసుకుంటే రూ.ఐదున్నర వేల నుంచి మొదలవుతుంది.  రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమి యం రైళ్లలో మొదటి శ్రేణి, రెండో శ్రేణి టికెట్‌ ధర కూడా విమాన టికెట్‌కు దగ్గరగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువే. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్‌ ఏసీ ధర (డైనమిక్‌లో నిలకడ ఉండదు) దాదాపు రూ.4,800 ఉంటోంది. కొన్నిమార్లు రూ.5 వేలు మించుతోంది.

పీక్‌ డిమాండ్‌లో ఫస్ట్‌క్లాస్‌ చార్జి రూ.7 వేలు పలుకుతోంది. ఈ రైలు ప్రయాణ సమయం 22 గంటలు. అంత చార్జి భరించి ఇన్ని గంటలు ప్రయాణించే బదులు, అంతే చార్జి ఉండే విమానంలో 2 గంటల్లో వెళ్లిపోవచ్చు. దీంతో డబ్బున్న వాళ్లు, విమానాల వైపు, సాధారణ ప్రజలు మరో రైలువైపు చూస్తున్నారు. ఇలా రైల్వేకు భారీ నష్టం వాటిల్లుతోంది. రైలు నిర్వహణ ఖర్చులు యథావిధిగా ఉంటుం డగా, టికెట్‌ ఆదాయం నామమాత్రంగా ఉంటోంది.ఆ రైలు వల్ల మరో రైలును అదే సమయంలో నడిపే అవకాశం లేక ప్రయాణ అవకాశాన్ని కూడా ప్రయాణికులు కోల్పోవాల్సి వస్తోంది. 

ఆ విధానాన్ని మార్చాలి..
ఈ సమస్యకు కారణమవుతున్న డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని మార్చాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. తాజాగా రైల్వే బోర్డు పరిధిలోని ఆలిండియా రైల్వే ప్యాసింజర్స్‌ సర్వీస్‌ కమిటీ సభ్యుడు వెంకటరమణి, రైల్వే ప్యాసింజర్స్‌ ఎమినిటీస్‌ కమిటీ సభ్యుడు ప్రేమేందర్‌రెడ్డితో కలసి మంగళవారం రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌తో దీనిపై చర్చించారు. తాము ఈ కేటగిరీ రైళ్ల తీరును అధ్యయనం చేసి వాస్తవాలు గుర్తించామని, ఈ రైళ్లు ఖాళీగా వెళ్లడం వల్ల నష్టం వాటిల్లుతోందని, డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని సడలిస్తే ఆ రైళ్లు కూడా నిండుతాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు