ఆఫీసుల్లో ప్రీపెయిడ్‌ కరెంట్‌ !

18 Nov, 2017 01:46 IST|Sakshi

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే 464 మీటర్ల బిగింపు.. మెరుగైన ఫలితాలు

ఆరు నెలల్లో మిగతా ఆఫీసుల్లోనూ పూర్తి

ఆ తర్వాత సాధారణ వినియోగదారులకూ అందుబాటులోకి.. 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ వృథాకు చెక్‌ పెట్టడంతో పాటు ప్రతి యూనిట్‌నూ పక్కాగా లెక్కించేందుకు ప్రీపెయిడ్‌ మీటర్లను అందుబాటులోకి తెచ్చింది దక్షిణ తెంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ. తొలుత నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే 464 ప్రీపెయిడ్‌ కనెక్షన్లు జారీ చేసిన డిస్కం.. ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. మరో ఆరు మాసాల్లో నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ఆ తర్వాత గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు.

గ్రేటర్‌లో 43 లక్షల కనెక్షన్లు
గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుతం 43 లక్షల విద్యుత్‌ కనె క్షన్లు ఉన్నాయి. వీటిలో 36 లక్షల గృహ, ఐదున్నర లక్షల వాణిజ్య, 45 వేల పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, హాస్టళ్లు, కార్పొరేషన్‌ ఆఫీసుల కనెక్షన్లే 22 వేల వరకూ ఉంటాయి. వీటి నుంచి నెలానెలా బిల్లులు వసూలు కాకపోగా.. బకాయిలు లక్షల్లో పేరుకుపో యి సంస్థకు నష్టాలు వాటిల్లుతున్నాయి. అంతేకాక పర్యవేక్షణ లోపం వల్ల విద్యుత్‌ దుబారా రెట్టింపైంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ ప్రీపెయిడ్‌ మీటర్‌ విధానాన్ని తొలి విడతగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ వసతి గృహాలకు, ఇతర కార్యాలయాలకు వర్తింపజేసి విద్యుత్‌ దుబారాను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇటీవల పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా రాజ్‌భవన్, ఎన్టీఆర్‌ ఘాట్‌ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని బిగించింది. ఇక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. నిజానికి మార్చి చివరి నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి రీడింగ్‌ నమోదు చేయాల్సి ఉంది. కానీ సరఫరా కంపెనీల వద్ద డిస్కం సూచించిన ఫీచర్లతో కూడిన మీటర్లు లేకపోవడంతో జాప్యం జరిగింది.

మీటర్ల బిగింపు ప్రక్రియ వేగవంతం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రీపెయిడ్‌ మీటర్ల బిగింపు ప్రక్రియను డిస్కం వేగవంతం చేసింది. పవర్‌–1, ఈసీఐఎల్, హెచ్‌ పీఎల్, జీనస్‌ కంపెనీలు ఈ మీటర్లను సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో 464 కనెక్షన్లను డిస్కం జారీ చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల పాటు సదరు సరఫరా కంపెనీలే చూసుకుంటున్నాయి. సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌కు రూ.8,668, త్రీ ఫ్రేజ్‌ మీటర్‌కు రూ.11 వేల వరకు ఖర్చు అవుతుండగా, ఈ ఖర్చంతా డిస్కమే భరిస్తుంది. మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తైన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి వీటిని ఔత్సాహిక వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

ఇలా పని చేస్తుంది..
ప్రస్తుతం ఉన్న మెకానికల్‌ మీటర్లను తొలగించి, దాని స్థానంలో ప్రీపెయిడ్‌ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌ను అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. వినియో గదారుడు ఇకపై ప్రతినెలా సెల్‌ ఫోన్‌ను రీచార్జ్‌ చేసుకున్నట్లుగానే ఇంట్లోని విద్యుత్‌ మీటర్‌ను రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్‌ ఉంటుంది. లైట్లు వెలుగుతాయి. లేదంటే కార్డును రీచార్జ్‌ చేసుకునే వరకు చీకట్లు తప్పవు. ఈ మీటర్ల కోసం ఆయా కార్యాలయాలు, సంస్థలు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి అయ్యే పూర్తి ఖర్చును డిస్కమే భరిస్తుంది. 

మరిన్ని వార్తలు