మళ్లీ కదిలిన మహా ఫ్లైఓవర్‌!

6 Nov, 2019 04:21 IST|Sakshi

మూసీ వెంట 52 కిలోమీటర్ల భారీ వంతెనకు సన్నాహాలు

రూ. నాలుగు వేల కోట్లతో హిమాయత్‌సాగర్‌ నుంచి గౌరెల్లి వరకు

ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీగా సందీప్‌ కుమార్‌ఝూ చేపట్టడంతో కదలిక

హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పీసీబీ అధికారులతో ప్రత్యేక సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌పెట్టేలా.. కాలుష్యం లేకుండా మూసీ నది తీరం వెంబడి నిర్మించాలనుకున్న ‘మహా’ఫ్లైఓవర్‌ ప్రతిపాదనలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌ నుంచి గౌరెల్లి వరకు దాదాపు 52 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల విస్తీర్ణంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ ఫ్లైఓవర్‌ రూపకల్పనపై చర్చలు జరిగినా అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ ఝా స్వీకరించడంతో మరోసారి ఈ భారీ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. జీహెచ్‌ఎంసీ, పీసీబీ, హెచ్‌ఎండీఏ అధికారులు హాజరైన ఈ సమావేశంలో ఆస్తుల సేకరణ, భూసేకరణ సమస్య లేని ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం రూ.నాలుగు వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాకు వచ్చారు.

తూర్పు, పడమర మధ్య ప్రయాణం సాఫీగా...
హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ, నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు అంటే నగరంలోని తూర్పు, పడమరలను కలిపే విధంగా ప్రత్యేక వంతెన నిర్మించనున్నారు. మూసీనది నగర శివారు పశ్చిమ ప్రాంతంలో హిమాయత్‌సాగర్‌ నుంచి ఈ వంతెన ప్రారంభమై నగర తూర్పు దిశలోని గౌరెల్లి వద్ద నగరాన్ని దాటుతుంది. నార్సింగి, టోలిచౌకి, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, రామంతాపూర్, నాగోల్, ఉప్పల్‌ను అనుసంధానం చేయడంతో పాటు విజయవాడ, వరంగల్‌ జాతీయ రహదారులను వికారాబాద్‌ రాష్ట్ర రహదారిని కలుపుతుంది. ఈ మూసీ నది తీరం వెంబడి నిర్మించే ఈ వంతెనకు భూసేకరణ, ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణ వంటి పనులు లేకపోవడంతో తొందరగానే పూర్తి కానుంది.

మరిన్ని వార్తలు